Begin typing your search above and press return to search.

రామ మందిరం భూమిపూజ పై 5 వివాదాలివే

By:  Tupaki Desk   |   4 Aug 2020 1:10 PM GMT
రామ మందిరం భూమిపూజ పై 5 వివాదాలివే
X
గత ఏడాది నవంబర్‌ లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక నిర్ణయంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధపై తుది తీర్పు ప్రకటించడంతో....కోర్టు ఆదేశాల ప్రకారం ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పడింది. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని మోడీ తన స్వహస్తాలతో ప్రతిష్టాత్మక ఆలయానికి పునాది రాయి వేయబోతున్నారు. ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12.15.15 గంటల నుంచి 12.15.47 గంటలలోపు(32 సెకన్లలోనే) వెండి ఇటుకలను ప్రతిష్ఠించి భూమిపూజ చేయబోతున్నారు. అయితే, ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జరుగుతున్న అట్టహాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమంపై పలు విమర్శలు వస్తున్నాయి.

ఓ వైపు ఈ భూమిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా...మరోవైపు కొన్ని వివాదాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి 5 ప్రధానమైన వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. మతపరమైన కార్యక్రమం అయినందున ప్రధాని మోడీ ఎలా హాజరవుతారని కాంగ్రెస్‌, ఎంఐఎం సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధాని రాజకీయాలకు అతీతం అని, అధికారిక హోదాలో మోడీ భూమిపూజకు హాజరు కావడం రాజ్యాంగ విరుద్ధం అని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ఎంఐఎం నేత ఒవైసీ ప్రశ్నించారు. అయితే ప్రధాని ప్రధాన అతిథిగా ఉన్న ఈ కార్యక్రమానికి.. ఆయన కంటే పెద్ద హోదాలో ఉన్న రాష్ట్రపతిని ఆహ్వానించకూడదని అధికారులు వివరణ ఇచ్చారు.

గతంలో సోమ్‌నాథ్‌ ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌, ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ హాజరయ్యారని, భారతమాత మందిరాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారని బీజేపీ నేతలు సమర్థించుకుంటున్నారు. గుడి కడితే కరోనా పోతుందని కొందరు భావిస్తున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించారు. తాను రామ మందిరం నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ కరోనా సమయంలో ఈ కార్యక్రమం జరపడం సరికాదని అన్నారు. ఇక, భూమిపూజకు సంఘ్ ‌పరివార్‌ నేతలనే ఎక్కువగా పిలిచారని, అన్ని పార్టీలను భూమిపూజకు ఆహ్వానించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ విమర్శించారు. శంకుస్థాపన తేదీ, ముహూర్తం శుభప్రదమైనది కాదని సంపూర్ణానంద సరస్వతి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు.

మోడీ తనకు అనుకూలంగా ముహూర్తం నిర్ణయించుకున్నారని, ఆగస్టు 5 చాతుర్మాస్య దీక్ష సమయంలోకి వస్తున్న తరుణంలో ప్రధానమైన పూజలు నిర్వహించకూడదని కొందరు అంటున్నారు. ఇక, తాత్కాలిక ఆలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం బదులు విల్లమ్ములు ధరించిన శ్రీరామచంద్రుడిని ప్రతిష్ఠించాలని ట్రస్టు నిర్ణయించడంపై వివాదం చెలరేగింది. పట్టాభిషేక సమయంలో శ్రీరాముడి విగ్రహాన్నిభూమిపూజ నాడు ప్రతిష్టించాలని సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ అన్నారు. అయితే, కోదండపాణిగా శ్రీరాముడి రూపం జగత్‌ ప్రసిద్ధమని, అందుకే ఈ రూపంలో ప్రతిష్టిస్తున్నామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఇన్ని వివాదల నడుమ రేపు జరగనున్న భూమిపూజ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.