టికెట్ కొన్న గిరిజనులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. అసలేం జరిగింది!

Fri Mar 31 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Theater Owners Disallows Tribal People In Chennai

ప్రస్తుతం తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. శింబు హీరోగా నటించిన పాతు తల చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను చూసేందుకు ఒక గిరిజన కుటుంబం చెన్నైలోనే రోహిణి సిల్వర్ స్క్రీన్ కి వెళ్లడం జరిగింది.టికెట్లు కొనుగోలు చేసిన ఆ గిరిజన కుటుంబాన్ని లోనికి అనుమతించకుండా థియేటర్ సిబ్బంది అడ్డుకోవడం జరిగిందట. తమ వేషధారణ చూసి లోనికి అనుమతించలేదని సదరు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అది కాస్త వైరల్ అవ్వడంతో జాతీయ స్థాయిలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివక్షకు నిదర్శనం అన్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ వివాదంపై గిరిజనుల హక్కుల సాధన ఉద్యమకారులు సీరియస్ గా స్పందించారు. ఈ నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం వివరణ ఇవ్వడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. పాతు తల చిత్రానికి సెన్సార్ బోర్డు యు / ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ సర్టిఫికెట్ ప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించేందుకు వీలులేదు.

సదరు గిరిజన కుటుంబం 12 ఏళ్లలోపు నలుగురు పిల్లలతో థియేటర్ కి రావడం జరిగింది. ఆ పిల్లలను లోనికి అనుమతించం అంటూ సిబ్బంది అన్నారు తప్పితే మొత్తం కుటుంబాన్ని లోనికి పంపించమని అనలేదని రోహిణి థియేటర్ యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది.

మరోవైపు గిరిజనుల హక్కుల సాధన సమితి ఈ వివాదంపై జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సదరు థియేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం ముదిరి చాలా దూరం వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే థియేటర్ యాజమాన్యం ఇచ్చిన వివరణ పట్ల గిరిజన నాయకులు సంతృప్తి చెందడం లేదు. థియేటర్ యాజమాన్య సంఘం రోహిణి థియేటర్ కి మద్దతుగా నిలుస్తోంది.