Begin typing your search above and press return to search.

దేశంలో వికార‌మైన భాష క‌న్న‌డ‌.. గూగుల్ ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   4 Jun 2021 9:30 AM
దేశంలో వికార‌మైన భాష క‌న్న‌డ‌.. గూగుల్ ప్ర‌క‌ట‌న‌!
X
ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్‌.. గూగుల్ లో త‌రచూ పొర‌పాట్ల దొర్లుతూనే ఉన్నాయి. ఆన్ లైన్లో స‌మాచారం కోసం అత్య‌ధికంగా నెటిజ‌న్లు గూగుల్ పైనే ఆధార‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొర‌పాట్ల‌తోపాటు అవాంఛ‌నీయ‌మైన ఫ‌లితాల‌ను చూపిస్తోంది. తాజాగా.. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. భార‌త‌దేశంలో అత్యంత వికార‌మైన భాష (ugliest language in india) ఏదంటే.. క‌న్న‌డ భాష అని రిజ‌ల్ట్ చూపించింది.

దీంతో.. క‌ర్నాట‌క వాసుల‌కు చిర్రెత్తింది. త‌మ భాష‌ను అవ‌మానిస్తే.. ఎవ‌రు మాత్రం మౌనంగా ఉంటారు? భాషను అవమానించడం అంటే.. అస్తిత్వాన్ని నిందించడమే. కాబట్టి.. కన్నడిగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ విష‌యం తీవ్ర కాక‌రేపింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కూడా స్పందించాల్సి వ‌చ్చింది.

క‌ర్నాట‌క సాంస్కృతిక మంత్రి అర‌వింద్ లింబావ‌ళి మాట్లాడుతూ.. గూగుల్ కు లీగ‌ల్ నోటీసులు జారీచేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. క‌న్న‌డ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన గూగుల్ వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప‌రిస్థితి అదుపు త‌ప్పేట్టు క‌నిపించ‌డంతో గూగుల్ అధికార ప్ర‌తినిధి స్పందించారు. భాష విష‌యంలో ఇలాంటి రిజల్ట్ వ‌చ్చినందుకు ముందుగా క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నామ‌న్నారు. అయితే.. గూగుల్ సెర్చ్ లో వ‌చ్చే ఫ‌లితాలు ప్ర‌తిసారీ ఖ‌చ్చిత‌మైన‌వి కాద‌ని అన్నారు. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు తాము చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో.. గూగుల్ సెర్చ్ లో క‌నిపించే ప్ర‌తీ ఫ‌లితం గూగుల్ అభిప్రాయం కాద‌ని, ఈ విష‌యాన్ని అంద‌రూ గ‌మ‌నించాల‌ని కోరారు.