అమెరికాలో మూడో వ్యాక్సిన్.. సింగిల్ డోస్ లోనే ఫినిష్!

Sun Feb 28 2021 12:20:33 GMT+0530 (IST)

The third vaccine in America .. Finish in a single dose!

కొవిడ్-19 ఉద్భవించి ఏడాది కాలం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో ప్రపంచం ఎన్నో దారుణులను చవిచూసింది. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ వైరస్ ను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు మొదటి నుంచే యుద్ధం మొదలు పెట్టారు. ప్రభావవంతమైన వ్యాక్సిన్ ప్రపంచానికి అందించేందుకు అన్ని దేశాల్లోనూ పరిశోధనలు మొదలు పెట్టారు.ఈ క్రమంలో దాదాపు ఏడాది కాలానికి కాస్త ముందూ వెనకా పలు దేశాలు తమ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చాయి. రష్యా భారత్ అమెరికా చైనా ఇలా.. పలు దేశాలు తమ దేశీయ వ్యాక్సిన్ ను వృద్ధి చేశాయి. ప్రస్తుతం ఆయా దేశాలతోపాటు ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోనూ వ్యాక్సినేషన్ ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో అమెరికా మరో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను ఆ దేశం ప్రజలకు అందుబాటులోకి తేగా.. ఇప్పుడు మూడో వ్యాక్సిన్ కూడా ఆమోదం లభించింది.

ఈ మూడో వ్యాక్సిన్ ను జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారుచేసింది. ఎమర్జెన్సీ వాడకం కోసం ఈ వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. గత రెండు వ్యాక్సిన్లతో పోలిస్తే.. ఇది ప్రత్యేకమైనది. గత డిసెంబర్‌లో ఫైజర్ మోడెర్నా వ్యాక్సిన్లకు అమెరికన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మొత్తం మూడు వ్యాక్సిన్లు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే జనాలకు అందుబాటులోకి తెచ్చిన ఫైజర్ మోడెర్నా వ్యాక్సిన్లు రెండు డోసులలో తీసుకోవాల్సి ఉంది. కానీ.. జాన్సన్ & జాన్సన్ కంపెనీకి చెందిన కొత్త వ్యాక్సిన్ మాత్రం కేవలం సింగిల్ డోస్ వ్యాక్సినే. అంటే.. ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది మంచి పరిణామం అనీ సింగిల్ డోస్ కావడంతో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తారని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) ఆశాభావం వ్యక్తం చేసింది.

అంతేకాదు.. ఈ సింగిల్-షాట్ వ్యాక్సిన్ కోవిడ్ -19 ను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఎఫ్‌డిఎ ప్రకటించింది. అంతేకాకుండా.. కరోనా కొత్త వేరియంట్ల మీద కూడా ఎఫెక్టివ్ గా  పనిచేస్తుందని తెలిపింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఇది అమెరికన్లందరికీ ఉత్తేజకరమైన వార్త. కొవిడ్ ముగింపునకు చేసే ప్రయత్నాల్లో ప్రోత్సాహకరమైన అభివృద్ధి’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు బిడెన్. అయితే.. వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం పనికిరాదని సూచించారు. వైరస్ ముప్పు ఇంకా ఉందని హెచ్చరించిన దేశాధ్యక్షుడు.. భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అమెరికన్లను కోరారు.  ఈ మూడో వ్యాక్సిన్ రోగని రోధక శక్తిని పెంచడానికి దోహదంచేస్తుందని బైడెన్ అన్నారు.

కాగా.. ఈ కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో ఇప్పటివరకు 500000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. ఆ దేశంలో కరోనా నివారణకు శరవేగంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే మూడో వ్యాక్సిన్ కు సైతం అనుమతులు ఇచ్చింది. మార్చి చివరి నాటికి 20 మిలియన్ల డోసులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ ప్రకటించింది. జూన్ నాటికి 100 మిలియన్ల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ మూడు వ్యాక్సిన్లతో కొవిడ్ ను సమర్థవంతంగా అడ్డుకోగలమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.