Begin typing your search above and press return to search.

ఆర్సీబీ కి .. 'కప్ నమదే' ఎందుకు దూరమో చెప్పిన స్టార్

By:  Tupaki Desk   |   21 March 2023 6:00 AM GMT
ఆర్సీబీ కి .. కప్ నమదే ఎందుకు దూరమో చెప్పిన స్టార్
X
అది 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్.. కోహ్లి అప్పటికే నాలుగు సెంచరీలు కొట్టి మొత్తం 970 పరుగులు చేశాడు. వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ కసికసిగా ఆడాడు. ఏబీ డివిలియర్స్ మెరుపులు సరేసరి. బెంగళూరు ఫైనల్ చేరింది. ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకేం? టైటిల్ కొట్టేసినట్లే అనుకున్నారు. కానీ.. స్వల్ప తేడాతో పరాజయం పాలైంది బెంగళూరు. ఇలా.. అప్పటికి ఎన్నోసార్లు.. 2009, 2011లోనూ ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. రెండేళ్లుగా మూడోస్థానంతో సరిపెట్టుకుంటోంది.

కానీ, బెంగళూరు అభిమానుల కల అయిన "ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే)" మాత్రం సాకారం కావడం లేదు. ఎందరో గొప్పోళ్లు.. బలమైనజట్టుగా ఉంటూ.. ప్రతి సీజన్ లోనూ ఆడి.. స్టార్ ఆటగాళ్లున్నప్పటికీ విరాట్ కోహ్లి వంటి గ్రేట్ బ్యాట్స్ మన్ కెప్టెన్ అయినప్పటికీ.. పదిహేనేళ్లలో టైటిల్ మాత్రం కొట్టలేకపోయిన జట్టు ఏది?... ఇంకేంటి.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, ఫాఫ్ డుప్లెసిస్, మిచెల్ స్టార్క్ ఇలా ఒకరిద్దరు కాదు ఎందరో స్టారాధిస్టార్లున్నప్పటికీ బెంగళూరు కప్ కల మాత్రం తీరలేదు. ప్లే ఆఫ్స్ లోనో, ఫైనల్లోనూ ఓడిపోవడం బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు సహజమైంది.

మెరికల్లాంటి బౌలర్లను వెదికిపట్టుకోకపోవడం, మెరుగైన ఆల్ రౌండర్లు లేకపోవడం ఇందుకు కారణం. 18 ఏళ్ల నవ యువ ఆటగాడిగా బెంగళూరుతో ప్రస్థానం మొదలుపెట్టిన కోహ్లి.. ఇప్పుడు 33 ఏళ్ల వయసుకు వచ్చాడు. అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. బెంగళూరుకు ఐపీఎల్ టైటిల్ మాత్రం సాధించి పెట్టలేకపోయాడు. అయితే, బెంగళూరు టైటిల్ కొట్టలేకపోవడానికి ఆ జట్టు మాజీ ఆటగాడు, విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ తనదైన కారణం చెప్పాడు.

త్రిమూర్తుల పైనే చూపంతా.. మిగతా వారికి జలస్?

ఐపీఎల్‌లో అందరి దృష్టి తనతో పాటు విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ పైనే ఉండేదని.. దీంతో మిగిలిన ఆటగాళ్లు జట్టులో భాగం కానట్లు ఆడడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ సాధించలేకపోయిందని గేల్‌ అన్నాడు. "జట్టులో కీలక ఆటగాడిగా ఉండడం ఎప్పుడూ ఆనందమే. కానీ ఐపీఎల్‌ లో ఆర్సీబీ కి ఆడుతున్నప్పుడు ఇంకో విషయం తెలిసింది. నాపై కోహ్లి, డివిలియర్స్‌ మీదనే అందరి దృష్టి ఉండేది. దీని వల్ల మిగిలిన ఆటగాళ్లలో ఎక్కువమంది తమకు ఈ జట్టుతో సంబంధం లేనట్లు ఉండేవాళ్లు. ఇలాంటి స్థితిలో ఉన్న ఏ జట్టుకైనా టైటిల్‌ గెలవడం పెద్ద సవాల్‌" అని
గేల్‌ పేర్కొన్నాడు.

వారిద్దరి జెర్సీలు వేలం గేల్‌, డివిలియర్స్‌ చాలా కాలం ఆర్సీబీ జెర్సీలు ధరించారు. వాటి నంబర్లు వరుసగా 333, 17. అయితే, డివిలియర్స్ రెండేళ్ల కిందట తప్పుకొన్నాడు. గేల్ ను అసలు ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో వారికి గౌరవంగా వారి జెర్సీ నంబర్లను రిటైర్‌ చేస్తున్నట్లు ఆర్సీబీ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇద్దరు దిగ్గజాలను బెంగళూరు తమ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి చేర్చింది. ఇకపై ఈ జెర్సీలను ఎవరి కీ కేటాయించరన్నమాట. కాగా, 2021 సీజన్‌ తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో గత సీజన్‌ నుంచి డుప్లెసిస్‌ ఆర్సీబీ పగ్గాలు చేపట్టాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.