Begin typing your search above and press return to search.

సెబీ చెప్పిన షాకింగ్ సత్యం: మార్కెట్ లో డబ్బులు పెట్టినోళ్లలో 90% నష్టాలే!

By:  Tupaki Desk   |   27 Jan 2023 1:00 PM GMT
సెబీ చెప్పిన షాకింగ్ సత్యం: మార్కెట్ లో డబ్బులు పెట్టినోళ్లలో 90% నష్టాలే!
X
షాకింగ్ సత్యాన్ని వెల్లడించింది సెబీ. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఫ్యూచర్స్.. ఆర్షన్ల విభాగంలో ట్రేడ్ అవుతున్న చిన్న మదుపరుల్లో 90 శాతం (సరిగ్గా చెప్పాలంటే 89 శాతం) మంది నష్టాల బారిన పడ్డట్లుగా గుర్తించినట్లు పేర్కొంది. అంటే.. మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి పది మందిలో తొమ్మిది మంది నష్టాల్ని చూడగా.. ఒక్కరు మాత్రమే లాభాల్ని సొంతం చేసుకున్నట్లుగా తేల్చింది.

ఇంత భారీగా నష్టపోవటానికి కారణాల్ని విశ్లేషించి.. నష్ట నివారణకు చేపట్టాల్సిన అదనపు చర్యలపై త్వరలో మార్గదర్శకాల్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా మార్కెట్లో ఉన్న ముప్పుపై అవగాహన పెరగటంతో పాటు.. నష్టాల బారిన పడకుండా చేయొచ్చని భావిస్తున్నారు. తాజాగా చేసిన అధ్యయనం కొవిడ్ కు ముందున్న ఏడాది.. కొవిడ్ తర్వాతి ఏడాది కావటం గమనార్హం.

ఈక్విటీ.. ఎఫ్ బీవో విభాగంలో చిన్న మదుపర్లకు నికరంగా వచ్చిన లాభం లేదా నష్టం ఆధారంగా సెబీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందుకోసం పది మంది స్టాక్ బ్రోకర్లకు చెందిన మదుపర్ల ట్రేడింగ్ ను పరిగణలోకి తీసుకున్నారు. ఈక్విటీ ఎఫ్ఖీవోలో 89 శాతం మంది చిన్న మదుపరులు నష్టపోయారు. సగటున ఒక్కొక్కరి నష్టం రూ.1.1 లక్షలుగా లెక్క గట్టారు. బాగా యాక్టివ్ గా ఉండే ట్రేడర్లలో 90 శాతం మంది సగటున రూ.1.25 లక్షల మొత్తాన్ని నష్టపోవటం గమనార్హం. కేవలం పదకొండు శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించగా.. వారి లాభం సగటున రూ.1.25 లక్షలు మాత్రమేనని లెక్క కట్టారు. ఇక.. లాభాలు వచ్చిన వారిలోనూ బాగా యాక్టివ్ గా ఉండేవారు పది శాతం మంది ఉండగా.. వారి సరాసరి లాభం సైతం రూ.1.9 లక్షలే.

ప్రముఖ బ్రోకరేజి సంస్థల వద్ద ట్రేడ్ చేస్తున్న చిన్న మదుపరుల సంఖ్య 2018-19 ఆర్థిక సంవత్సరానికి 7.1 లక్షలు ఉంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 45.2 లక్షలు కావటం గమనార్హం. ట్రేడ్ చేసే వారిలో చిన్న మదుపరుల్లో 30-40 ఏళ్లకు చెందిన వారే ఎక్కువని.. వారి సంఖ్య దాదాపు 39 శాతం ఉన్నట్లుగా చెబుతున్నారు. 2018-19లో వీరు కేవలం 11 శాతమే ఉండేవారని.. ఇటీవలకాలంలో ఈ సంఖ్య ఎక్కువైనట్లుగా పేర్కొన్నారు. సెబీ వెల్లడించిన ఈ వివరాల్ని చూసినప్పుడు..ఈక్విటీ.. ఆప్షన్లలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అన్నట్లుగా మదుపు చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.