తెలంగాణలో రాజకీయాల్లో ఈ దృశ్యం.. ఎన్నాళ్లకెన్నాళ్లకూ!

Fri Sep 24 2021 05:00:02 GMT+0530 (IST)

The scene in politics in Telangana

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను విజయ బాటలో నడిపించి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న కేసీఆర్‌కు ఇప్పుడు గట్టి సెగ తగులుతోంది. తనకు ఎదురు నిలిచే పార్టీ రాష్ట్రంలో ఉండకూడదని తనను ప్రశ్నించే నాయకుడు కనిపించకూడదని అందుకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలు రచించి.. ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలను ఆకర్షించి తిరుగులేని నాయకుడిగా కేసీఆర్ మారారు. ఆయన దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు కూడా తలో దిక్కు అన్నట్లు వ్యవహరించ సాగాయి.కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇన్ని రోజులు ఎవరికి వారే అన్నట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కేసీఆర్‌పై పోరాటానికి జత కలిశాయి. తెలంగాణలోని బీజేపీ మినహా మిగతా పార్టీలు ప్రజా సంఘాలు ఒక్క తాటిపైకి కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆ ప్రయాణంలో మొదటి అడుగుగా.. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు దగ్గర ప్రతిపక్షాలు కలిసి మహా ధర్నా నిర్వహించాయి. అందులో కాంగ్రెస్ సీపీఎం సీపీఐ టీడీపీ టీజేఎస్ సహా ఇతర పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోడు భూములు సమస్య పెరుగుతోన్న ఇంధన ధరలు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల వినియోగం నేతల ఇళ్లపై దాడులు.. ఇలా మరెన్నో విషయాలపై ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని.. అటు కేంద్రంలోని బీజేపీ సర్కారును నిలదీసేలా ఈ మహా ధర్నాలో నాయకులు ప్రసంగించారు. వాళ్ల మాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఇలా ఏకం కావడం రాష్ట్ర రాజకీయాలకు మంచిదేననే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తాయని ఇన్ని రోజులు అలాంటిదేం లేకపోవడం వల్లనే రాష్ట్రంలో కేసీఆర్ ఆడిందే ఆటగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌కు సవాలు విసిరేలా ఈ రాజకీయ ఉద్యమం మొదలైందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇలా రాష్ట్రంలోని ప్రతి పక్షాలు ఒక్కటవడానికి తెలంగాణ ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడయ్యాక జోరు పెంచిన రేవంత్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ఇప్పుడేమో కేసీఆర్‌పై పోరాటంలో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావడంలో విజయవంతమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. ప్రజల సమస్యల పోరాటం కోసం రాష్ట్రంలో ఇన్ని రోజులకు ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ జత కట్టడం శుభ పరిణామమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇక టీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు తప్పవనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.