Begin typing your search above and press return to search.

ఈ తెలుగువారు ప్ర‌పంచ కుబేరులు ఎలా అయ్యారు..?

By:  Tupaki Desk   |   5 March 2021 4:01 AM GMT
ఈ తెలుగువారు ప్ర‌పంచ కుబేరులు ఎలా అయ్యారు..?
X
ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల జాబితాను హురున్ గ్లోబ‌ల్ రిచ్ సంస్థ రిలీజ్ చేసింది. 2021 సంవ‌త్స‌రానికి గానూ రూపొందించిన ఈ లిస్ట్‌ బుధ‌వారం విడుద‌లైంది. ప్ర‌పంచంలోని 68 దేశాల్లో 2,402 సంస్థ‌ల‌కు చెందిన 3,228 మంది కోటీశ్వ‌రుల లెక్క‌ల‌ను సేక‌రించారు. జ‌న‌వ‌రి 15 నాటికి ఉన్న సంప‌ద వివ‌రాల ప్ర‌కారం ఈ జాబితాను రూపొందించారు.

మొత్తం 177 మందికి ప్ర‌పంచ కుబేరుల జాబితాలో స్థానం ల‌భించింది. వీరిలో టెస్లా సంస్థ‌ల అధినేత ఎల‌న్ మ‌స్క్ 1970 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 ధ‌న‌వంతునిగా నిలిచారు. దేశంలో రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ 6.05 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌తో మొద‌టి స్థానంలో ఉన్నారు. ఇక‌, ఈ జాబితాలో స్థానం సంపాదించిన‌ తెలుగు వారి గురించి చూస్తే..

ముర‌ళీ దివిః హైద‌రాబాద్ కు చెందిన దివీస్ సంస్థ అధినేత‌. ఈయ‌న 74 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలో 385వ స్థానంలో ఉన్నారు. 1990లో మెడిక‌ల్ రీసెర్చ్ సంస్థ దివీస్ లేబొరేట‌రీస్ ను స్థాపించారు. ఫార్మా సూటిక‌ల్ ఉత్ప‌త్తుల పంపిణీదారుల్లో ఈ సంస్థ ప్ర‌పంచంలోనే అగ్ర‌స్థానంలో ఉంది. ఈయ‌న ఏపీలోని మ‌చిలీప‌ట్నంలో పెరిగారు. కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న క‌ష్ట‌ప‌డి ఎదిగాన‌ని ఫోర్బ్స్ ఇంట‌ర్వ్యూలో ఓ సారి చెప్పారు ముర‌ళీ. ఆయ‌న పిల్ల‌లు కూడా సంస్థ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు.

పీవీ రామ‌ప్ర‌సాద్ రెడ్డిః అర‌బిందో ఫార్మా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. 1986లో త‌న బంధువు నిత్యానంద రెడ్డితో క‌లిసి ఈ సంస్థ‌ను స్థాపించారు. షుగ‌ర్‌, హార్ట్ రోగాల‌కు సంబంధించిన మందుల‌ను ఈ సంస్థ త‌యారు చేస్తుంది. సంస్థ ఆదాయంలో 75 శాతం అమెరికా, యూకే నుంచి వ‌స్తుంది.ఈయ‌న 31 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలో 1096వ స్థానంలో ఉన్నారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కూడా ఈయ‌న స్థానం సంపాదించారు.

బి. పార్థ‌సార‌థి రెడ్డిః 1993లో హెటెరో డ్ర‌గ్స్ సంస్థ‌ను స్థాపించారు. ఈ సంస్థ యాంటీ రెట్రో వైర‌ల్ మందుల ఉత్ప‌త్తితో మార్కెట్లో అడుగు పెట్టింది. ఈయ‌న 22 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలో 1609వ స్థానంలో నిలిచారు. ఈయ‌న‌కు రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్‌, మేనిఫాక్చ‌రింగ్ అండ్‌మార్కెటింగ్ లో విశేష అనుభ‌వం ఉంది. ఈ అనుభవ‌మే త‌మ సంస్థ ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డింది.

జీవీ ప్ర‌సాద్‌, జి అనురాధః వీరిద్ద‌రూ సంయుక్తంగా 15 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచ కుబేరుల జాబితాలో 2238వ స్థానంలో నిలిచారు. జీవీ ప్ర‌సాద్ రెడ్డీస్ లాబొరేట‌ర‌సీ కో-చైర్మ‌న్ గా ఉన్నారు. ఈ సంస్థ‌ను ఆయ‌న మామ అంజిరెడ్డి స్థాపించారు. జీవీ ప్ర‌సాద్ ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజ‌నీరింగ్‌, ప‌ర్డ్యూ యూనివ‌ర్సిటీ నుంచి మాస్ట‌ర్ డిగ్రీ తీసుకున్నారు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్ర‌ఫీ అంటే చాలా ఇష్ట‌ప‌డే ప్ర‌సాద్‌.. వ‌ర‌ల్డ్ వైడ్ ఫండ్ ఫ‌ర్ నేచ‌ర్ కార్య‌క్ర‌మాల్లో చుర‌గ్గా పాల్గొంటూ ఉంటారు. ఈయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.

స‌తీష్ రెడ్డిః ఈయ‌న రెడ్డీస్ లేబొరేట‌రీస్ కు డైరెక్ట‌రుగా ఉన్నారు. ఈ సంస్థ‌ను స‌తీష్ రెడ్డి తండ్రి అంజిరెడ్డి 1983లో స్థాపించారు. ఈయ‌న 17 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో 2050వ స్థానంలో ఉన్నారు. ఈయ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఇంజ‌నీరింగ్ లో డిగ్రీ తీసుకున్నారు ప‌ర్ డ్యూ యూనివ‌ర్సిటీలో మెడిసిన‌ల్ కెమిస్ట్రీ చ‌దివారు. 1991 నుంచి కుటుంబ వ్యాపారంలోకి దిగారు. అప్పటి నుంచి ఆయ‌నే బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈయ‌న భార్య దీప్తి ప్రాంతీయ ప‌త్రిక ‘వావ్’ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు.

ప్ర‌తాప్ రెడ్డిః అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌తాప్ రెడ్డి 16 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో 2138వ స్థానంలో ఉన్నారు. ఈయ‌న అమెరికాలో వైద్య విద్య పూర్తిచేసుకొని 1971లో ఇండియా తిరిగి వ‌చ్చారు. 1983లో 150 ప‌డ‌క‌ల‌తో చెన్నైలో స్థాపించిన అపోలో హాస్పిట‌ల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 64 శాఖ‌ల‌కు విస్త‌రించి 10,000 ప‌డ‌క‌ల స్థాయికి ఎదిగింది. అదే విధంగా అపోలో ఫార్మ‌సీ కూడా ఎంత‌గానో విస్త‌రించింది. ఆయ‌న సేవ‌ల‌కు గానూ 1991లో ప‌ద్మ‌భూష‌ణ్‌, 2010లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు ఇచ్చింది భార‌త ప్ర‌భుత్వం.

జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుః 1981లో మై హోమ్ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌ను స్థాపించారు. ఆ విధంగా మొద‌లైన రామేశ్వ‌ర‌రావు ప్ర‌స్థానం.. ఇంతింతై అన్న‌ట్టుగా ఎదిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న‌త స్థాయికి చేరుకున్నారు. ప్ర‌ముఖ సిమెంట్ కంపెనీ.. మ‌హా సిమెంటు కూడా ఈయ‌న‌దే. ప్ర‌స్తుతం ఈయ‌న 14 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో 2383వ స్థానంలో ఉన్నారు.

వీసీ న‌న్న‌ప‌నేనిః ఫార్మా రంగంలో వీసీ న‌న్న‌ప‌నేనికి దాదాపు 40 ఏళ్ల‌కు పైబ‌డిన అనుభ‌వం ఉంది. ఆయ‌న అమెరికాలో వివిధ ఫార్మా సంస్థ‌ల్లో ప‌నిచేశారు. ఈయ‌న ఆంధ్ర యూనివ‌ర్సిటీ, విశాఖ‌ప‌ట్నం నుంచి ఫార్మ‌సీలో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని బ్రూకాన్ లిన్ కాలేజీ నుంచి కూడా ఫార్మా అడ్మినిస్ట్రేష‌న్ లో మాస్ట‌ర్ డిగ్రీ పొందారు. ఆ విధంగా.. ఫార్మా రంగంలోకి అడుగుపెట్టిన వీసీ.. నాట్కో ఫార్మా సంస్థ‌ను స్థాపించారు. త‌న గ‌త అనుభ‌వంతో స‌క్సెస్ ఫుల్ గా ఈ సంస్థ‌ను అభివృద్ధివైపు న‌డిపించారు. ప్ర‌స్తుతం 12 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ఆయ‌న 2686వ స్థానంలో ఉన్నారు.