భైంసా ఎపిసోడ్ తో ఆ రిపోర్టర్ కాస్తా ఎంపీకి పీఏ అయ్యారు

Mon Feb 17 2020 11:45:30 GMT+0530 (IST)

The reporter became a PA MP with the episode of violence

కొన్నిసార్లు అవకాశాలు పలుకరిస్తూ వస్తాయి. మరికొన్నిసార్లు మాత్రం తాము చేస్తున్న పని పట్ల ఉండే కమిట్ మెంట్ కొత్త అవకాశాల్ని వచ్చేలా చేస్తాయి. హైదరాబాద్ జర్నలిస్టు సర్కిల్స్ లో కొద్ది రోజులుగా అందరి నోట నానుతున్న ఒక రిపోర్టర్ కు అనుకోని వరంగా ఒక చక్కటి అవకాశం లభించిందని చెప్పాలి. అయితే.. ఈ ఛాన్స్ అతనికి ఊరికే రాలేదు. దాని వెనుక ఎంతో శ్రమ.. అంతకు మించిన ఒత్తిడి.. దీనింతటికి మించిన జర్నలిస్టు ప్రొఫెషన్ మీద అతనికున్న ప్యాషన్ అతన్ని ఈ రోజు మరో స్థాయి కి వెళ్లేలా చేసిందని చెప్పాలి.సంచలనంగా మారిన భైంసా ఉదంతం వెలుగు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని చాలామంది జర్నలిస్టులు.. ఆ విషయాన్ని టీవీల్లోనూ.. పేపర్లలోనూ చదివి ఊరుకున్నారు. కొందరు ఉత్సాహ వంతులు మాత్రం దీనిపై కాస్త చర్చించుకున్నారు. అయితే.. అందుకు భిన్నంగా సిద్దు అనే యువ రిపోర్టర్ మాత్రం అందుకు భిన్నంగా హైదరాబాద్ నుంచి భైంసాకు ప్రత్యేకంగా వెళ్లాడు. ఆ మాటకు వస్తే.. ఒక రిపోర్టర్ కు ఉండే కుతూహలం తో గ్రౌండ్ జీరోలో ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం.. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయటం కోసం వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత అతగాడు చూసిన పరిస్థితులు.. బాధితులు అతనికి చెప్పిన విషయాల్ని విని కదిలిపోయాడు. ఇంత జరుగుతుంటే.. మీడియాలో వచ్చిన కథనాలు అతన్ని వేదనకు గురి చేశాయి. నిజాన్ని నిజంగా చెప్పటానికి ఎందుకు వెనకడుగు వేయాలనుకున్న ఈ రిపోర్టర్.. తాను చూసింది.. తనకు బాధితులు చెప్పిన విషయాల్ని గుదిగుచ్చుతు ఒక పోస్టును సోషల్ మీడియా లో పోస్టు చేశారు. ఇదో సంచలనం గా మారింది. దీనిపై అతను కేసులు ఎదుర్కొన్నాడు. కోర్టు జోక్యం తో దాని నుంచి బయట పడ్డాడు.

ఆ సమయంలో అతనికి ఎదురైన బెదిరింపులు.. ఎవరికి లేనిది నీకే ఎందుకంటూ సుద్దులతో పాటు.. చాలానే ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. భైంసా పోస్టుకు ముందు మహా చానల్ లో ఉద్యోగం మానేసి.. కొత్త జాబ్ కోసం వెతుకుతున్న పరిస్థితి. వెబ్ సైట్లలో పని చేసినా జీతం రాని దుస్థితి. ఇలాంటివేళ.. అతడు తన మనసుకు నచ్చినట్లుగా.. ఒక పాత్రికేయుడిగా స్పందించి.. భైంసా అంశాన్ని బయటకు తీసుకొచ్చిన వైనం బీజేపీ ఎంపీ అరవింద్ వరకూ వెళ్లింది. ఆయన ప్రత్యేకం గా రిపోర్టర్ సిద్ధును తన పీఏగా ఉండాలని కోరటంతో అతను ఓకే అనేశాడు. దీంతో.. నిన్నటి వరకూ రిపోర్టర్ గా ఉన్న సిద్ధు ఇప్పుడు ఎంపీ పీఏగా మారారు. పని పట్ల నిజాయితీ తో ప్రదర్శించే కమిట్ మెంట్.. అందుకు తగ్గ ఫలితాన్ని ఇస్తుందని చెప్పటానికి ఇదో ఉదాహరణగా చెప్పక తప్పదు.