బిడ్డ కోసం తల్లి గేదె 3 కి.మీ. పరిగెత్తింది

Wed Nov 24 2021 09:41:31 GMT+0530 (IST)

The mother buffalo for the baby is 3 km Ran

కాలం చాలానే మార్పుల్ని తీసుకొస్తోంది. అన్నింటికి మించి గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. సామాజిక మార్పులు అన్ని ఇన్ని కావు. పెళ్లై.. పిల్లలు ఉన్నప్పటికీ.. అర్థం లేని ప్రేమలు.. వ్యామోహాల్లో కూరుకుపోయి కొందరు ఎంతటి దారుణానికైనా తెగబడుతున్న వైనాన్ని అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే.తాము మిస్ చేసుకున్నదేదో.. దొరికేసిందన్న అత్యాశతో.. తమకు అడ్డుగా ఉన్నారని భర్తను భార్య.. భార్యను భర్త.. పిల్లల్ని తల్లి చంపేసుకుంటున్న దారుణాలు ఈ మధ్యన ఎక్కవు అవుతున్నాయి.

మనుషుల్లో ఉండాల్సిన ప్రేమాభిమానాలు కాలపరీక్షకు నిలిస్తే.. అందుకు భిన్నంగా నోరు లేని మూగజీవాలు మాత్రం.. కాలం వాటి ప్రేమను ఏ మాత్రం మార్చలేకపోతున్నాయి. తాజాగా చెన్నైలో చోటు చేసుకున్న ఈ వైనానికి చెందిన వీడియోను చూస్తే.. తీవ్రమైన భావోద్వేగానికి గురి కావటం ఖాయం.

చెన్నై పోరూర్ కు చెందిన ప్రసాద్ మోహన్ పశువుల్ని పెంచుతూ పాల వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలానే తన పశువుల సంతను మేత కోసం బయటకు తీసుకెళ్లారు. అక్కడ గేదె ఈనింది. బుల్లి దూడ బయటకు వచ్చింది. అక్కడ నుంచి ఇంటికి దాన్ని తీసుకురావటం కష్టం కావటంతో.. తెలిసిన వారికి ఫోన్ చేశాడు. వారు టూ వీలర్ ను తీసుకొచ్చారు.

ఈ పిల్ల దూడను తీసుకొని ఇద్దరి మధ్య పెట్టుకొని ఇంటికి బయలుదేరారు. అనూహ్యంగా అప్పటివరకు మామూలుగానే ఉన్న తల్లి గేదె.. తన బిడ్డను ఎక్కడికో తీసుకెళుతున్నారన్న ఆందోళనతో.. బండి వెనుక పరుగులు తీసింది. దాదాపు మూడు కి.మీ. పాటు అలానే యజమాని వాహనంతో పాటు పరుగులు తీసింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మనషుల్లో అంతకంతకూ తగ్గిపోతున్న ప్రేమాభిమానాలు ఎంతన్న విషయాన్నితన చేష్టలతో అర్థమయ్యేలా చేసింది ఈ తల్లి గేదె.