Begin typing your search above and press return to search.

వామ్మో.. బ‌ర్డ్ ఫ్లూతో దేశంలో తొలి మ‌ర‌ణం..!

By:  Tupaki Desk   |   21 July 2021 7:52 AM GMT
వామ్మో.. బ‌ర్డ్ ఫ్లూతో దేశంలో తొలి మ‌ర‌ణం..!
X
ఓ పక్క కరోనా కంగారుతో జనాలు అతలాకుతలం అవుతుంటే మరో పక్క బర్డ్ ఫ్లూ రూపంలో మరో మహమ్మారి కోరలు చాస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ... జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారే ఎన్నో కొత్త రూపాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా అందులో వచ్చి చేరింది. ఈ వ్యాధిని తక్కువగా అంచనా వేయొద్దని ఇప్పటికే అందరూ హెచ్చరించారు. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో విధంగా ఈ వ్యాధి జనాలను కంగారు పెడుతూనే ఉంది.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో బర్డ్ ఫ్లూ సోకి హర్యానాకు చెందిన సుశీల్ అనే 11 సంవత్సరాల బాలుడు ప్రాణాలు విడవడం అందరిలో ఆందోళన రేపుతోంది. అసలు కరోనా వల్లే భయంతో చస్తూ బతికిన జనాలకు ప్రస్తుతం బర్డ్ ఫ్లూ విరుచుకు పడడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఏకంగా ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ సోకి మరణించడంతో అనేక మంది కంగారు పడుతున్నారు. ఆ బాలుడు ప్రాణాలు విడవడమే కాకుండా ఆ బాలుడికి చికిత్స చేసిన డాక్టర్లు కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక్కడ మరో విషయమేంటంటే అతడికి ముందుగా పరీక్షలు చేసిన డాక్టర్లకు నెగటివ్ గా తేల్చారు. కానీ అనుమానంతో అతడి శాంపిల్స్ ను పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు పంపడంతో అక్కడ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు బాలుడికి బర్డ్ ఫ్లూ సోకిందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో అప్రమత్తమైన వైద్యులు అతడికి అన్ని రకాల వైద్యం అందించినప్పటికీ అతడిని కాపాడలేకపోయారు. అతడితో కాంటాక్ట్ అయిన మరింత మందిని గుర్తించేందుకు ఓ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా హర్యానా పంపించారు.

బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఈ వైరస్ కోళ్లు, పక్షులకు సోకుతుంది. కానీ మొట్టమొదటి సారి ఈ వైరస్ ఓ మనిషికి సోకి అతడి ప్రాణాలను హరించింది. ఈ సంవత్సరం మొదట్లోనే మన దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ లతో పాటు చాలా రాష్ర్టాల్లో ఈ వైరస్ దుమారం రేపింది .వేల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. కానీ మనుషులకు మాత్రం ఎలాంటి హాని కలుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా ఈ వైరస్ మనుషులకు సోకి వారి ప్రాణాలను కూడా తీస్తుండడంతో అందరిలో కలవరం మొదలయింది.

ఇదివరకే బర్డ్ ఫ్లూ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. వాటి ప్రకారం ఉడికీ ఉడకకుండా ఉన్న గుడ్లను తినకూడదు. అలాగే చాలా మంది మాంసం సరిగ్గా ఉడకక ముందే తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని అధికారులు ప్రకటించారు. కొంత మంది మాంసాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉంచి విక్రయాలు చేస్తుంటారు. కొనుక్కుని కొందరు అలాగే పచ్చి మాంసాన్ని తింటారు. ఇలా తినడం ప్రమాద కరమని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.