Begin typing your search above and press return to search.

జనసేనకు కమ్మటి రంగు...టార్గెట్ అదే....?

By:  Tupaki Desk   |   17 Aug 2022 2:30 PM GMT
జనసేనకు కమ్మటి రంగు...టార్గెట్ అదే....?
X
రాజకీయాల్లో రంగు రుచి వాసనలు వేరయా అని పొలిటికల్ వేమన్నలు ఏనాడో చెప్పారు. రాజకీయం చేయాలంటే చాలా చాలా ఉండాలి. మన రంగులు బయటపడకూడదు, ఎదుటి వారి మీద మాత్రం పెద్ద ఎత్తున‌ రంగులేయాలి. అసలు రంగులు బయట పెట్టాలీ. ఇదీ రాజకీయ నీతి. దాన్ని అంతా తుచ తప్పకుండా అనుసరిస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీది ఒక రంగు, టీడీపీది మరో రంగు. కొత్తగా వచ్చిన జనసేనది ఏ రంగు. అంటే దానికీ ఒక రంగు ఉంది.

అయితే ఆ పార్టీ కుల ముద్రను కోరుకుంటుందో లేదో తెలియదు కానీ ప్రత్యర్ధులు మాత్రం వారు కోరుకుంటున్న కులం ముద్ర వేసి బదనాం చేస్తున్నారు. జనసేన పుడుతూనే టీడీపీతో స్నేహం చేసింది. ఆ తరువాత విడిగా ఉంటున్నా ముద్ర మాత్రం తొలగిపోవడంలేదు. జనసేన టీడీపీ ఒక్కటే. ఈ రెండు పార్టీలదీ ఒక్కటే రాజకీయం అని 2019 ఎన్నికల్లో జనాల్లో విపరీతంగా ప్రచారం చేసి వైసీపీ భారీ లబ్ది పొందింది.

అదే రాజకీయ వ్యూహాన్ని 2024 ఎన్నికల్లోనూ అమలు చేయాలని వైసీపీ చూస్తోంది. దాంతో టీడీపీతో జనసేన దోస్తీ అంటూ జగన్ నుంచి సాధారణ నాయకుడి దాకా అంతా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దత్తపుత్రుడు పవన్ అంటూ నేరుగా జగనే ఆరోపించిన సందర్భం ఉంది. మరో వైపు చూస్తే జనసేన మొత్తం సీట్లకు పోటీ చేయాలని మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు సవాల్ చేస్తారు. ఆ విధంగా పవన్ ప్రకటించాలని వారు కోరుతారు.

దీని వెనక రాజకీయం ఏంటి అంటే జనసేన పొత్తులో ఉండనని తెగించి చెప్పడమే. అలా చేయాలనే వైసీపీ ఎత్తుగడ. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే కనుక జనసేనకు తాను అనుకున్నట్లుగా సామాజికవర్గం అనుకూలం కాకుండా చేసే మరో ఎత్తుగడకు కూడా వైసీపీ దిగుతోంది. అందులో భాగనే తాజాగా మంత్రి గుడివాడ అమరనాధ్ చేస్తున్న ఆరోపణలు.

ఆయన జనసేనను పట్టుకుని ఏకంగా ఒక కుల ముద్ర వేశారు. అది కాపు జనసేన కాదు, కమ్మల జనసేన అని గుడివాడ అనడం ద్వారా కాపులంతా జనసేన మీద భ్రమలు పెంచుకోవద్దు అని ఒక సున్నితమైన హెచ్చరిక కూడా జారీ చేశారు అనుకోవాలి. కాపులు జనసేనను ఇపుడు సొంతగా భావిస్తున్నారు. ఆ ప్రభావం ఏపీలోని గోదావరి జిల్లాలలో కనిపిస్తోంది.

దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందుకు వస్తాయని ఆలోచించిన మీదటనే గుడివాడ లాంటి వారి చేత ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు అని అంటున్నారు. జనసన కాపుల సేన కాదు కమ్మల సేన అనడం ద్వారా ఆ పార్టీ వైపుగా సాగుతున్న కాపులను ఆపాలనుకునే ప్రయత్నమే ఇదని అంటున్నారు. కమ్మల పార్టీగా ఇప్పటికే ముద్రపడిన తెలుగుదేశం బాటలో ఆ పార్టీ కనుసన్ననలో జనసేన నడుస్తోందని చెప్పే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలి.

మొత్తానికి చూస్తే వైసీపీ జనసేనను గట్టిగానే టార్గెట్ చేసింది. ఈసారి మరింతగా కూడా టార్గెట్ చేస్తోంది. అయితే ఇక్కడ జనసేన రాజకీయ సామాజిక పునాది మీదనే దెబ్బకొట్టేలా ఈ హాట్ కామెంట్స్ గుడివాడ చేశారు అని అంటునారు. మరి దీన్ని కాపులు నమ్ముతారా. జనసేనను తమ సొంత పార్టీగా భావించే వారు కమ్మ జనసేన అంటే ఒప్పుకుంటారా. లేక వైసీపీ కామెంట్స్ ని వారికే తిప్పికొడతారా. వెయిట్ అండ్ సీ.