Begin typing your search above and press return to search.

అగ్నికి ఆహుతి అయిన హైదరాబాద్ అందం

By:  Tupaki Desk   |   16 Jan 2022 5:30 AM GMT
అగ్నికి ఆహుతి అయిన హైదరాబాద్ అందం
X
విలక్షణ రూపం భాగ్యనగరి సొంతం. అరుదైన అందాలకునెలువుగా ఉంటుందీ పెరల్ సిటీ. ఓవైపు ప్రాచీనత.. మరోవైపు ఆధునికత.. సమ్మిళ సమ్మేళంగా నిలిచే హైదరాబాద్ మహానగరంలో ఒక పురాతన కట్టడం అగ్నికి ఆహుతైంది. మహానగర ఘన చరిత్రను గుర్తు చేసేలా ఉండే సికింద్రాబాద్ క్లబ్ లో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదంలో ఈ క్లబ్ పూర్తిగా దగ్థమైంది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ఆగ్నిమాపక శాఖ పది శకటాలతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.

దాదాపు మూడు గంటలు శ్రమించి మంటల్ని ఆపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటల్ని అదుపు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం.. ఎప్పటిలానే విద్యుత్ షార్ట్ సర్క్యుట్ గా చెబుతున్నారు. అయితే.. అధికారికంగా మాత్రం బయటకురాలేదు. సంక్రాంతి సందర్బంగా క్లబ్ కు సెలవుకావటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఈ అగ్నిప్రమాదం కారణంగా పూడ్చలేని నష్టం జరిగిందని చెబుతున్నారు. రూపాయిల్లో జరిగిన ఆస్తి నష్టం రూ.20 కోట్లుగా చెబుతున్నా.. వందల కోట్ల రూపాయిల చారిత్రక సంపద సర్వనాశనమైందని.. అలాంటి భవనాల్ని తిరిగి నిర్మించటం అసాధ్యమని చెబుతున్నారు. జంటనగరాల్లో అత్యంత పురాతన.. ఖరీదైన క్లబ్బుల్లో దీని తర్వాతే మరేదైనా. 1878లో బ్రిటీష్ మిలటరీ అధికారుల కోసం ఈ క్లబ్ ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నిర్మాణాలు.. విలక్షణంగా ఉంటాయి.

ఈ క్లబ్ ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ గా విడుదల చేశారు. ఈ క్లబ్ లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తారు. ఈ క్లబ్ లో 5వేల మందికి పైనే సభ్యత్వం ఉంది. ఇందులో సభ్యత్వం పొందాలంటే ఆషామాషీ వ్యవహారం కాదని.. భారీ స్థాయిలో రికమెండేషన్లు అవసరమని చెబుతారు. మహానగర చారిత్రక సంపదకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సికింద్రాబాద్ క్లబ్.. అగ్నికీలలకు ఆహుతి కావటం చరిత్రను అభిమానించే వారంతా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.