Begin typing your search above and press return to search.

'క్యూ'లో నిలబడతాడు.. రోజుకు రూ.16వేలుసంపాదిస్తాడు

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:27 AM GMT
క్యూలో నిలబడతాడు.. రోజుకు రూ.16వేలుసంపాదిస్తాడు
X
విన్నంతనే నమ్మలేరు కానీ.. ఇది నిజం. వివరాలన్ని తెలిసిన తర్వాత.. మన దగ్గరా అలాంటిఅవకాశం ఉందా? అన్న ఆలోచన కలుగకపోదు. క్యూలో నిలబడి అంత మొత్తం ఎలా సంపాదిస్తారు? ఇంతకీ అతగాడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అంత డబ్బులు ఎలా సంపాదిస్తాడన్న లెక్క చెబుతారా? అని అడగొచ్చు. నిజమే.. అతడి గురించి వివరాలతో పాటు.. అతడి ఆదాయ లెక్కను సింఫుల్ గా చెప్పేయొచ్చు. అదెలానో చూస్తే..

క్యూలో నిలబడి రోజూ కళ్లు చెదిరే ఆదాయాన్ని సొంతం చేసుకునే అతగాడి పేరు ఫ్రెడ్డీ బెకిట్. ఇతను ఉండేది లండన్ లో. ఇతను చేసే పనిని.. అక్కడ చాలా మర్యాదగా ‘క్యూయర్’ అంటారు. అంటే.. పెద్ద క్యూ లైన్ లో నిలబడే ఓపిక లేని వారు.. ఇలాంటి క్యూయర్ లను ఏర్పాటు చేసుకుంటారు. వీరు చాలా ప్రొఫెషనల్ గా తమ పనిని పూర్తి చేస్తారు. సినిమా హాల్ కావొచ్చు.. మరేదైనా ఈవెంట్ కావొచ్చు.. ఇంకేదైనా సూపర్ మార్కెట్ స్టోర్ కావొచ్చు. ఏదైనా సరే.. బారు క్యూల ముందు నిలబడి.. గంటల కొద్దీ వెయిట్ చేసే ఓపికా.. తీరికా కొందరికి ఉండకపోవచ్చు.

అలాంటి వారికి సేవలు అందించేందుకు ఫ్రెడ్డీ బెకిట్ సిద్దంగా ఉంటారు. ఆ మాటకు వస్తే.. అలాంటి వాళ్లు లండన్ లో కొందరు ఉంటారు. వారంతా ఏదైనా బారు క్యూ ఉన్న చోట తమ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉంటారు. వయసు మళ్లిన వారు.. ఓపిక లేనివారు.. ఆరోగ్యం సరిగా లేని వారు.. సమయం లేని వార.. ఇలాంటి క్యూయర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం గంటకు మన రూపాయిల్లో రూ.2000 ఇస్తారు. రోజులో కనీసం ఇలాంటి పని 8 గంటల వరకు చేసే వీలుంది. దీంతో.. అతనికి రోజుకు రూ.16వేల వరకు వస్తాయని చెబుతున్నారు.

వినేందుకు విచిత్రంగా ఉన్నా.. ఇలాంటి ఉద్యోగం అని కాదు కానీ పని మన దగ్గర కూడా ఉంది. గతంలో ఐఆర్ సీటీ వెబ్ సైట్ పెద్దగా అందుబాటులో లేనప్పుడు.. నెట్ వసతి తక్కువగా ఉన్న వారు తత్కాల్ టికెట్ల కోసం రైల్వే స్టేషన్ లో ముందు రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి క్యూలో నిలుచునే వారు.

అలా నిలుచోవటం కష్టంగా ఉన్న వారు.. రూ.200 నుంచి రూ.400 వరకు మొత్తం ఇచ్చి.. ఉదయం తత్కాల్ సమయానికి వచ్చి తమ ప్లేస్ లోకి వచ్చేవారు. మన దగ్గర ఇలాంటి పనులకు ఇచ్చే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. విదేశాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి. కాకుంటే అక్కడ మాదిరి ఎక్కువ ఆదాయం మన దగ్గర ఉండదంతే.