భారతీయులపై అమెరికా పక్షపాతం.. చైనా.. పాకిస్థానీయులు అంత ముద్దా?

Fri Sep 30 2022 10:03:26 GMT+0530 (India Standard Time)

The US is biased towards Indians.

అగ్రరాజ్యం అమెరికా వ్యవహరిస్తున్న తీరు భారతీయులకు చుక్కలు చూపిస్తోంది. వీసా ఇస్తారో.. చస్తారో కానీ.. దాని ప్రాసెస్ కు పట్టే సమయం షాకింగ్ గా మారింది. అమెరికాకు వెళ్లాలనుకునే వారంతా అమ్మ బాబోయ్ అన్న అనేలా అమెరికా వీసా ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పాలి. కరోనా తర్వాత అమెరికాకు తొలిసారి వెళ్లాలనుకునే వారు వీసా ఇంటర్వ్యూలకు ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉండటం.. దీని కోసం నడుస్తున్న వెయిటింగ్ మరింత కష్టంగా మారింది.అగ్రరాజ్యంలో చదువుకోవటానికి వెళ్లే విద్యార్థులు.. వీసా ఇంటర్వ్యూ కోసం 14 నెలలు.. అదే తొలిసారి అమెరికాకు టూరిస్టుగా వెళ్లాలనుకునే వారు తమ ఇంటర్వ్యూ డేట్ కోసం ఏకంగా 19 నెలలు వెయిట్ చేయాల్సి వస్తోంది. అయితే.. ఇప్పటికే వీసా జారీ అయి.. దాన్ని రెన్యువల్ చేసుకునే వారికి మాత్రం పెద్ద ఇబ్బందులు లేవు. విద్యార్థి వీసా కోసం అప్లై చేసే విద్యార్థులు చెన్నైలోని అమెరికా కాన్సులేట్ ద్వారా అప్లై చేసుకుంటే నెల రోజుల్లో ఇంటర్వ్యూ వచ్చే పరిస్థితి.

అదే దేశంలోని మిగిలిన ప్రాంతాలైన హైదరాబాద్ లో అయితే 430 రోజులు.. కోల్ కతాలో 444 రోజులు.. ముంబయిలో 430రోజులు.. ఢిల్లీలోనూ 430 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక.. టూరిస్టుగా ఆ దేశంలో అడుగు పెట్టాలనుకునే వారు హైదరాబాద్ లో 582 రోజులు.. చెన్నైలో 780 రోజులు.. కోల్ కతాలో 767 రోజులు.. ముంబయిలో 848రోజులు.. ఢిల్లీలో 833 రోజులు కేవలం ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
ఇంత దారుణంగా వెయిటింగ్ పిరియడ్ ఉంటే..

మన ఇరుగుపొరుగు దేశాల నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఉండే సౌలభ్యం గురించి తెలిస్తే షాక్ తినటం ఖాయం. భారత్ విషయంలో అమెరికా ఇంత దారుణంగా వ్యవహరిస్తుందా? అన్న భావన కలుగక మానదు. ఎందుకంటే..

భారత్ నుంచి ఎవరైనా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి నెలల తరబడి వీసా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సి వస్తే.. మన దాయాది పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ నుంచి వీసా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తే ఒక్కరోజు వ్యవధిలోనే ఇంటర్వ్యూ లభిస్తుంది.

అదే చైనాలోని బీజింగ్ లోని కాన్సులేట్ అయితే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వీసా ఇంటర్వ్యూ ఉండటం గమనార్హం. భారత్ తమకు అత్యంత సన్నిహిత స్నేహితుడని చెప్పే అమెరికా అధ్యక్షుడి మాటలకు.. చేతలకు మధ్య దూరం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. భారత్ పట్ల.. భారతీయుల పట్ల అమెరికాకు ఇంతటి వివక్ష ఎందుకు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.