జీవితాన్ని సమాజం కోసం అంకితం చేశానన్న కవిత.. ఆ మాట చెప్పటం ఏంది?

Fri Mar 17 2023 16:00:36 GMT+0530 (India Standard Time)

The Kavitha says that she has dedicated her life for society..

అందుకే అంటారు.. తొందరపడి మాట్లాడే ప్రతి మాటకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. నోట్లో నుంచి వచ్చే మాట.. చేతి రాతతో సమకూర్చే సమాచారం అదనపు విషయాల మీద అవగాహన కలిగేలా చేస్తుంది. ఇలాంటి కొన్ని సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నట్లుగా చెప్పొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను అనుమానితురాలిగా భావిస్తూ.. ఆమెకు నోటీసులు జారీ చేసిన ఈడీ ఒకసారి ఇప్పటికే విచారణ జరపటం.. మరోసారి విచారించేందుకు ఆమెకునోటీసులు ఇవ్వటం తెలిసిందే.ఈ సందర్భంగా ఈడీకి ఒక లేఖ రాసిన ఆమె.. పలు అంశాల్ని ప్రస్తావించారు. తన తండ్రి కేసీఆర్ నివాసంలో ఉన్న ఆమె.. బయటకు రాకుండానే తన ప్రతినిధి చేత ఈడీ అధికారులకు లేఖ పంపటం తెలిసిందే. ఈ లేఖలో ఒక చోట ఆమె పేర్కొన్న అంశానికి.. మరోచోట దానికి పూర్తి భిన్నంగా పేర్కొన్న మరో అంశానికి మధ్యన పొంతన కుదరకపోవటం.. దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

"నేను నా జీవితాన్ని ప్రజా సేవ కోసం అంకితం చేశా. ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తా. ఈ సందర్భంగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. దేశంలోని ఏ ఒక్క మహిళ కూడా తన హక్కులను కోల్పోకుండా కాపాడటం ఒక మహిళా నాయకురాలిగా దేశ పౌరురాలిగా నా బాధ్యతగా భావిస్తాను. అలాంటిది నా హక్కులనే హరించే పరిస్థితి వస్తే.. వాటిని కాపాడుకునేందుకు కావాల్సిన చర్యలను కచ్చితంగా తీసుకుంటాను" అని పేర్కొన్న కవిత మాటల్లో మొదటి లైన్ చూస్తే.. ప్రజాసేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నట్లుగా మహా గొప్పగా చెప్పుకున్నారు.

ఆ తర్వాత అదే లేఖలో తాను ప్రస్తావించే అంశాలకు సంబంధించి చివరి అంశంలో ఆమె పేర్కొన్న మరో విషయంతో కొత్త చర్చకు తెర తీసినట్లైంది. అదేమంటే.. " మీరు సూచించిన మేరకు నా ప్రతినిధిగా సోమా భరత్ కుమార్ను మీ దగ్గరికి పంపుతున్నాను. ఈ వినతిపత్రంతోపాటు నా బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యక్తిగత వ్యాపార వివరాల పత్రాలను పంపిస్తున్నాను. వీటిని పరిశీలించి ఇంకా ఏమైనా అదనపు సమాచారం కావాలంటే నా ప్రతినిధిని గానీ లేదా నేరుగా నాకు మెయిల్ చేయడం ద్వారా సంప్రదించగలరు" అని కవిత పేర్కొన్నారు.

ఇందులో తన వ్యాపార వివరాలకు సంబంధించిన పత్రాల్ని పంపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతకు ముందుతన జీవితం మొత్తం ప్రజాసేవకు అంకితం చేసినట్లుగా చెప్పుకున్న కవిత.. వ్యాపార వివరాల పత్రాలు పంపించటం ఏమిటి? ప్రజాసేవలో జీవితాన్ని అంకితం చేసే వారు.. వ్యాపారాలు కూడా చేస్తారా? అలాంటప్పుడు వారు ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసినట్లు ఎలా అవుతారు. వారి జీవితంలో ప్రజాసేవ ఒక భాగం. అది కూడా వ్యాపారం మాదిరే కదా? అన్నది సందేహంగా మారింది. మరి అంతలా ప్రజాసేవలో మునిగిపోయిన వారు వ్యాపారం ఎందుకు చేస్తున్నట్లు? ఇంతకూ తాను చేసే వ్యాపారం ఏమిటో కూడా కవిత వెల్లడించి ఉంటే మరింత బాగుండేదేమో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.