వైసీపీకి షాక్ ఇచ్చిన కాపులు!

Sat Mar 18 2023 10:11:21 GMT+0530 (India Standard Time)

The Kappus gave a shock to the YCP!

ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించి.. అతి త్వరలో అక్కడ నుంచి పరిపాలించాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఉత్తరాంధ్రలో గట్టి దెబ్బ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఘన విజయం సాధించారు. దాదాపు 15 శాతం ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బ్రాహ్మణ సమాఖ్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు చిరంజీవిరావు షాకిచ్చారు.కాగా వేపాడ చిరంజీవిరావు కాపు సామాజికవర్గానికి చెందినవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులు ఆ పార్టీకి వివిధ కారణాలతో దూరమయ్యారని అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కేంద్రం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించింది.

అంతేకాకుండా కాపుల రిజర్వేషన్ అంశం తన పరిధిలో లేదని.. కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మరోవైపు ఆయా కులాలకు రిజర్వేషన్లు ప్రకటించే అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. దీంతో కాపుల రిజర్వేషన్ అంశంలో జగన్ ప్రభుత్వానిదే తప్పు అని తేలిందని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో బీసీ సామాజికవర్గాలతోపాటు కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. మెగాభిమానులు అత్యధికమని చెబుతున్నారు. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన విధానం పట్ల కాపు సామాజికవర్గంతోపాటు మెగాభిమానులు ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను విశాఖలో ర్యాలీ చేయకుండా అడ్డుకోవడం ఆయన ర్యాలీగా వెళ్తుంటే కరెంటు తీసి అడ్డుకోవడం అర్ధరాత్రి ఆయన బస చేసిన హోటల్ లోకి పోలీసులు వెళ్లి అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడం ఉత్తరాంధ్ర యువతలో ముఖ్యంగా మెగాభిమానుల్లో ఆగ్రహం నింపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జనసేన –టీడీపీ పొత్తు ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యాపించడం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఫలించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గం మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసిందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.