అక్కడి మహిళల ప్రత్యేకత తెలిస్తే అవాక్కే!

Tue Jan 22 2019 10:18:19 GMT+0530 (IST)

ఎలాంటి అనారోగ్యం లేకుండా వందేళ్లు జీవించగలరా? 60 ఏళ్ల వయసులో పండంటి పిల్లలకు జన్మనివ్వటం సాధ్యమేనా?  వయసు పెరుగుతున్నా.. చర్మం కాంతివంతంగా ఉండటమే కాదు.. యవ్వనంలో ఉన్నట్లు మిసమిసలాడటం సాధ్యమేనా?  ఇక.. ఆరోగ్య సమస్యలకు అల్లంత దూరంలో ఉండటం సాధ్యమేనా? అంటే.. నో అంటే నో అనేస్తారు.అయితే.. ఇన్ని ప్రత్యేకతలున్న మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎక్కడో కాదు.. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ లో  వారు నివసిస్తుంటారు. మిగిలిన వారికి భిన్నంగా సాగే వారి జీవితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్థాన్ లోని సగటు జీవి యావరేజ్ ఆయుష్షు 67 ఏళ్లు. అయితే.. బురుషా తెగ వారి జీవితకాలం అక్షరాల వందేళ్లు. బురుషా అని పిలిచే ఈ తెగ వారిని హుంజాల పేరుతోనూ పిలుస్తుంటారు.

పాక్ లోని హుంజా ప్రాంతంలో వీరు నివసిస్తుంటారు. సాధారణంగా 40 ఏళ్ల వయసు వచ్చే సరికి పిల్లల్ని పుట్టే అవకాశం మహిళల్లో తగ్గుతుంది. కానీ.. ఈ తెగ వారు ఏకంగా 60 ఏళ్ల వయసులోనూ పండంటి పిల్లలకు జన్మనిచ్చే సత్తా వారి సొంతం. ఇక.. కేన్సర్ లాంటి జబ్బుల గురించి తెలీదు. ఇదెలా సాధ్యం?  వీరికున్న ప్రత్యేకత ఏమిటంటే.. వీరి జీవనశైలే కారణంగా చెప్పాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలి.. తీసుకునే ఆహారంలో వీరు తీసుకునే జాగ్రత్తలే.. వీరిని మిగిలిన వారికి ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం.. అదే సమయంలో ఏ మాత్రం బద్ధకించకుండా.. నిత్యం శ్రమించటం కూడా వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతోంది. గడ్డ కట్టే చలిలోనూ చన్నీళ్ల సాన్నం చేసేందుకు ఇష్టం ప్రదర్శించే వీరు.. నిత్యం వ్యాయామానికి.. నడకకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు.

ఈ తెగ వారిలో 90 శాతం మంది అక్షరాస్యులే కావటం మరో ఆసక్తికరమైన అంశం. నిత్యం వారు తీసుకునే ఆహారంలో పండ్లు.. తృణధాన్యాలు.. గుడ్లు.. సొంతంగా పండించిన కూరగాయలు.. పాలు.. ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. జిహ్వ చాపల్యంతో కనిపించినంత తినేయకుండా రోజుకు 2వేల కేలరీలకు మించకుండా ఆహారాన్ని తీసుకోవటం వారికి అలవాటు.

అంతేకాదు.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వారు అస్సలు ముట్టుకోరు. అంతేకాదు.. హిమనీ నదాల నుంచి వచ్చే స్వచ్చమైన నీటిని మాత్రమే తాగటంతో పాటు.. మూలికలతో తయారు చేసిన తుమురు టీని వారు నిత్యం సేవిస్తుంటారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏడాదిలో మూడు నెలల పాటు ఆహారం తీసుకోకుండా.. బీ12 అధికంగా ఉండే ఆప్రికాల్ పండ్లను.. వాటి నుంచి తయారు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీంతో.. కేన్సర్ వీరి దరికి చేరని పరిస్థితి. మరి.. మీరూ ట్రై చేస్తారా?