Begin typing your search above and press return to search.

కాగ్ లెక్క‌లు.. కొన్ని సందేహాలు.. ఆరునెల్ల అప్పు ఒకే నెలలోన‌ట‌!

By:  Tupaki Desk   |   29 July 2021 11:30 AM GMT
కాగ్ లెక్క‌లు.. కొన్ని సందేహాలు.. ఆరునెల్ల అప్పు ఒకే నెలలోన‌ట‌!
X
ఏపీ ఆదాయ, వ‌యాల‌పై కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌(కాగ్‌) తాజాగా నివేదిక వెల్ల‌డించింది. దీని ప్ర‌కారం.. ఆరు నెల‌ల్లో చేయాల్సిన అప్పుల‌ను ఒకే నెల‌లో చేశార‌ని.. పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించుకుంద‌ని కాగ్ వెల్ల‌డించింది. ఏడాది మొత్తం మీద రూ.37,079 కోట్లు రుణంగా ఏపీ సర్కారు బడ్జెట్‌లో ప్రతిపాదించింద‌ని పేర్కొన్న కాగ్‌.. దీనిలో 53.18 శాతం తొలి నెలలోనే తీసుకుందని తెలిపింది.

గతేడాది అది 34.57 శాతంగా ఉందని పేర్కొంది. నిజానికి కాగ్ గ‌త ఏడాది వ‌ర‌కు(ఆర్థిక సంవ‌త్స‌రం) కూడా ఏటా ఒక్క‌సారి మాత్ర‌మే రాష్ట్రాలు చేస్తున్న వ్య‌య‌, ఆదాయ విష‌యాల‌ను గ‌ణించేది. కానీ, మోడీ తీసుకువ‌చ్చిన ప్ర‌త్యేక నిబంధ‌న‌ల కార‌ణంగా.. కాగ్‌.. ఇప్పుడు ప్ర‌తి నెలా బీజేపీయేత‌ర రాష్ట్రాల ప‌ద్దుల‌ను ప‌రిశీలిస్తోంది. దీనిలో భాగంగానే త‌మిళ‌నాడు, తెలంగాణ‌, కేర‌ళ‌, ఒడిశా, డిల్లీ త‌దిత‌ర 9 రాష్ట్రాల‌కు చెందిన వ్య‌యాల‌ను ఏప్రిల్ నెల‌లోనే ప‌రిశీలించింది. దీనికి సంబంధించి తాజాగా రిపోర్టును అందించింది.

ఏప్రిల్‌ నెల లెక్కల ప్ర‌కారం.. ప్రజా రుణం(ప‌బ్లిక్ డెట్‌) కింద రూ.3,926.33 కోట్లు, ప్రజా పద్దుగా ఉన్న రూ.15,861 కోట్లు కలిసి ఉంద‌ని తెలిపింది. ఇలా వచ్చిన మొత్తంలో రూ.73.47 కోట్లు నగదు నిల్వగా ఉండటంతో మొత్తం రుణం రూ.19,714.04 కోట్లుగా లెక్క కట్టింది. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఏప్రిల్‌లో పన్నుల రాబడి మరీ తగ్గిపోయింద‌ని పేర్కొంది. కేవలం రూ.7,738 కోట్లే దక్కింద‌ని.. దీనిలో జీఎస్టీ రూ.2,866.14 కోట్లు వచ్చింద‌ని కాగ్ వివ‌రించింది.

కేంద్ర సాయం రూ.3,630 కోట్లతోపాటు పన్నేతర ఆదాయమూ కలిపితే అది రూ.11,616 కోట్లకు చేరింద‌ని కాగ్ పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఏప్రిల్‌లో రూ.31,311 కోట్లు ఖర్చు చేశారు. ఇది సంక్షేమ ప‌థ‌కాల కోసం వెచ్చించిన‌ట్టు కాగ్ వివ‌రించింది. దీనిలో చేయూత‌, సున్నా వ‌డ్డీ ప‌థ‌కాలు ఉన్నాయ‌ని వివ‌రించింది. దీనిలో రాబడి రూపేణా వచ్చింది కేవలం 37 శాతమేన‌ని.. అప్పులు, ఇతరత్రా రుణాల రూపంలో సమీకరించింది సుమారు 63 శాతం ఉంద‌ని వివ‌రించింది.

ఇక‌, అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వ‌రుస‌లో నిలిచింద‌ని కాగ్ పేర్కొన‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో చేసిన అప్పుల్లో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 19 వేల 714 కోట్ల‌తో ముందు నిల‌వ‌గా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1925 కోట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక‌, కేర‌ళ 14 వేల పైచిలుకు కోట్ల‌తో రెండో ప్లేస్‌లోను, రాజ‌స్థాన్ 7 వేల కోట్లతో మూడోస్థానంలోను నిలిచింది.

అయితే.. ఇదంతా వ్యూహం ప్ర‌కారం.. కేంద్రం చేస్తున్న ఆర్థిక దాడిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎంత స్వ‌తంత్ర సంస్థ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తి నెలా కాగ్ రాష్ట్రాల అప్పులు, ఆదాయంపై ఫోక‌స్ పెట్ట‌ద‌ని.. కానీ.. ఇప్పుడు బీజేయేత‌ర రాష్ట్రాల‌ను ఎంచుకుని మ‌రీ.. కాగ్ ఇలా .. ``మీరు అప్పులు ఎక్కువ చేస్తున్నారు. మీకు ఆర్థిక క్ర‌మశిక్ష‌ణ లేదు`` అని చెప్పేందుకే కేంద్రం ఆడిస్తున్న వ్యూహంలో భాగంగా తాజాగ‌ణాంకాలు.. వెల్ల‌డిస్తున్న‌ద‌ని.. నిపుణులు భావిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో కుదేలైన రాష్ట్రాల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌ల‌మైన కేంద్ర ప్ర‌భుత్వం.. అప్పులు చేసుకోమ‌ని ప్రోత్స‌హించ‌లేదా? అనే విష‌యాన్ని వారు తెర‌మీదికి తెస్తున్నారు. దీనిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. దీని వెనుక రాజ‌కీయ కోణ‌మే ఉంద‌ని అంటున్నారు.