Begin typing your search above and press return to search.

పాక్ ఫ్లైట్ కూలటానికి ముందు ఏం జరిగిందో చెప్పిన బ్యాంక్ సీఈవో

By:  Tupaki Desk   |   25 May 2020 6:00 AM GMT
పాక్ ఫ్లైట్ కూలటానికి ముందు ఏం జరిగిందో చెప్పిన బ్యాంక్ సీఈవో
X
దాయాది పాక్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురి కావటం.. విమానంలో ప్రయాణిస్తున్న 99 మందిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ప్రమాదంలో మరణించటం తెలిసిందే. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరిలో ఒకరు తాజాగా నోరు విప్పారు. ప్రమాదం జరిగిన తీరును బయటపెట్టారు. విమానం కూలటానికి ముందు చోటు చేసుకున్న పరిణామాల్ని చెప్పుకొచ్చారు. లాహోర్ లో బయలుదేరిన విమానం కరాచీ వచ్చే వరకూ ఎలాంటి సమస్య లేదని.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ముహమ్మద్ జుబేర్ చెప్పారు.

ఇతడితో పాటు.. మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అతని పేరు జఫర్ మసూద్. ఇతగాడు బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను.. ప్రమాద అనుభవాన్ని వెల్లడించారు. ల్యాండ్ అయ్యే ముందు పైలెట్ అందరిని సీటు బెల్టు పెట్టుకోవాలని కోరినట్లు చెప్పారు. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయానికి విమానం మూడుసార్లు.. కుదుపులకు లోనైందని.. దీంతో విమానాన్ని అమాంతం గాల్లోకి లేపారన్నారు. ఆ టైంలో తాను కిందకు చూస్తే.. మాలిర్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నట్లు అర్థమైందన్నారు.

క్షణాల్లోనే.. విమానం జనావాసాల్లో కుప్పకూలిపోయిందని.. ఆ తర్వాతేం జరిగిందో తనకు తెలీదని చెప్పారు. కాస్త తెలివి వచ్చి.. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ భయంకరమైన పొగతో నిండి ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అంశాలు బయటకు వచ్చాయి. ల్యాండ్ అయ్యే చివరి నిమిషాల్లో విమానంలోని సాంకేతిక సమస్యను గుర్తించారు. విమానప్రమాదం కంట్రోల్ తప్పినప్పుడు మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు డేంజర్ సిగ్నల్ ను ఇచ్చారు పైలెట్. ఏటీసీ సిబ్బందిని అప్రమత్తం చేసి.. విమానాన్ని కంట్రోల్ తప్పకుండా ఉండటం కోసం ఎంత ప్రయత్నించినా.. దాన్ని నిలువరించటం సాధ్యం కాలేదు. 'WE HAVE LOST ENGINE' అన్న మాట చెప్పి చెప్పగానే ఫ్లైట్ క్రాష్ అయినట్లుగా తెలుస్తోంది.