బీటెక్ స్టూడెంట్ నిఖితను అందుకే చంపాను: నిందితుడు

Wed Oct 28 2020 15:00:49 GMT+0530 (IST)

Thats why I killed BTech student Nikhit: Accused

హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ ఘర్ లో బీటెక్ విద్యార్థిని నిఖిత తోమర్ హత్య సంచలనం సృష్టించింది. ఆమెను నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుడు తౌసిఫ్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు.కొన్నేళ్లుగా నిఖితను పెళ్లి కోసం తౌసిఫ్ బలవంతం చేస్తున్నాడని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ నిఖితను అతడు వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఇది ‘లవ్ జిహాద్’ కోణంలో జరిగిన హత్యేనని  వారు ఆవేదన వ్యక్తం చేశారు.  2018లో తౌసిఫ్.. నిఖితను కిడ్నాప్ చేశాడని.. అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు.

కాగా నిఖితను హత్య చేసిన తౌసిఫ్ ను పోలీసులు పట్టుకొని విచారించారు. నిఖిత వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉందని.. అందుకే ఆమెను హత్య చేశానని తౌసిఫ్ పోలీసులకు చెప్పాడు. 2018లో కిడ్నాప్ ఆరోపణలతో తనను నిఖిత అరెస్ట్ చేయించిందని.. మెడిసన్ చదవాలన్న తన కోరిక నెరవేరకుండా చేసినందుకు నిఖితను చంపి రివేంజ్ తీర్చుకున్నట్లు నిందితుడు తౌసిఫ్ పోలీసుల ఎదుట నిజాలు వెల్లడించాడు.

ఇక హత్యకు ముందురోజు అక్టోబర్ 24న రాత్రి నిఖిత-తౌసిఫ్ ఫోన్ లో మాట్లాడుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సుమారు 16 నిమిషాల పాటు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఏం మాట్లాడుకున్నారనే దానిపై పోలీసులు వివరించలేదు.

కాగా నిఖిత మృతదేహంతో వారి కుటుంబం రోడ్డెక్కింది. ఫరీదాబాద్-మథుర హైవేపై భైటాయించింది. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పింది. పోలీసులు నచ్చజెప్పి పంపించారు. భారీ భద్రత నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.