గత్యంతరం లేదు..అందుకే బంతి జడేజాకిచ్చా .. ఓటమి పై ధోనీ

Sun Oct 18 2020 14:20:46 GMT+0530 (IST)

That's why Given The Ball To Jadeja..Dhoni About defeat

షార్జాలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో తుది వరకూ  చెన్నై దే విజయం అనుకున్నా  ఉన్నట్టుండి  రేస్  లోకి వచ్చిన ఢిల్లీ అమాంతం మ్యాచ్ ను లాగేసుకుంది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ 17 పరుగులు చేయాల్సి ఉండగా ధోని బంతిని జడేజా కి ఇచ్చాడు. జడేజా బౌలింగ్ ని ఢిల్లీ పించ్ హిట్టర్  అక్షర్  పటేల్ తుత్తునియలు చేసాడు. 2 3 5 బంతులను సిక్సర్లు గా మలిచాడు. దీంతో అప్పటివరకు చెన్నై విజయం అనుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఢిల్లీ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ బ్రేవో ని  కాదని జడేజాకు ఇవ్వడం వల్లే చెన్నై ఓటమి కారణమని క్రికెట్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.ఈ ఓటమిపై చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. 'తమకు వేరే అవకాశం లేని పరిస్థితుల్లోనే చివరి ఓవర్లో జడేజా చెత్త బౌలింగ్ చేయించాం. బ్రేవో ఫిట్ గా లేకపోవడంతో అప్పటికే మైదానం వీడి  వెళ్లాడు.. వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో జడేజాకు అవకాశం ఇచ్చాము. చివరి ఓవర్లో జడేజా  కర్ణ్ మాత్రమే ఆప్షన్ గా ఉన్నారు.  అందువల్లే జడేజాను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది.  శిఖర్ ధావన్ విజృంభించి ఆడుతున్నాడంటే అతడి స్ట్రైక్ రేట్ కూడా అలాగే ఉంటుంది. అతడు ఇచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాం. ధావన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి  మ్యాచ్ ను తమ నుంచి లాగేసుకున్నాడు. మేము 10 పరుగులు సాధించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని' ధోనీ  చెప్పుకొచ్చాడు.

పగ తీర్చుకున్న అక్షర్ పటేల్

చెన్నై- ఢిల్లీ మ్యాచ్ లో ధావన్ సెంచరీ చేసినా.. మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం అక్షర్ పటేలే. ఆఖర్లో మూడు సిక్సర్లు కొట్టి ఢిల్లీని  గెలిపించాడు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అక్షర్ పటేల్  ధోని పై పగ తీర్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. సెహ్వాగ్ కూడా దీనిపై ట్వీట్ చేసాడు. నాలుగేళ్ల కిందట ధోని మెరుపులతో అక్షర్ పటేల్  బలి  అయ్యాడని.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అక్షర్ పటేల్ సద్వినియోగం చేసుకొని ధోని పై పగ తీర్చుకున్నాడని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 2016లో ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై జట్టు నిషేధానికి గురి కాగా.. పూణే తరఫున ఆడుతున్న ధోని పంజాబ్ తరపున ఆడుతున్న అక్షర్ పటేల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ మ్యాచ్లో పూణే పంజాబ్ పై  ఘన విజయం సాధించింది. అక్షర్ పటేల్ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.