జంగారెడ్డి గూడెం పోలీసులతో అంతే మరి.. స్కూల్ పిల్లలకు లాకప్.. లాఠీ దెబ్బలు

Sat Mar 18 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

That's it with Jangareddy Gudem police.. School children locked up

 తరచూ వివాదాల్లో చిక్కుకునే ఏపీ పోలీసులకు సంబంధించిన ఒక షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ఇంతకాలం విపక్ష నేతల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని.. వారి విషయంలో దురుసుగా వ్యవహరించటమే కాదు.. కేసులు పెట్టే విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరున్న వేళ.. తాజాగా స్కూల్ పిల్లల విషయంలో ఏపీకి చెందిన జంగారెడ్డి గూడెం పోలీసుల తీరు ఇప్పుడు వివాదంగా మారింది. స్కూల్ విద్యార్థులు మైనర్లు కావటం.. వారిపై ఉన్న చిన్న ఆరోపణ మీద పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి.. లాకప్ లో వేసి.. లాఠీ దెబ్బలు కొట్టి.. స్టేషన్ బయట గంటల కొద్దీ ఉంచిన వైనం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే తొమ్మిదో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు  క్లాస్ రూంలోని ఫ్యాన్ రెక్కలు.. ట్యూబ్ లైట్లు పాడు చేశారంటూ టీచర్లు విజయ్ సుధాకర్ రెడ్డిలు వారిని కొట్టారు. అక్కడితో ఆగకుండా కౌన్సెలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పిల్లల్ని భయపెట్టాలని ఇతర నిందితులతో కలిపి లాకప్ లో వారిని పడేశారు. ఆ సమయంలో ఒక  కానిస్టేబుల్ వారిపై తన లాఠీతో తన ప్రతాపాన్ని చూపించాడు.

అనంతరం స్టేషన్ బయట కూర్చోబెట్టారు. స్టేషన్ ఆవరణలో ఉంచి సాయంత్రం వరకు వారిని ఉంచినా.. కనీసం భోజనం కూడా పెట్టలేదు. ఈ విషయాన్ని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పలేదు. అలా చెబితే వారు కూడా కొడతారని భయపడ్డారు. ?ఇలాంటి వేళ.. బాధిత విద్యార్థికి చెందిన ఒకరి సోదరుడు తండ్రికి ఈ విషయాన్ని తెలపటంతో ఆందోళన చెందిన ఆయన స్టేషన్ కు వచ్చాడు. స్టేషన్ మెట్ల మీద పిల్లలు ఏడుస్తూ కనిపించారు. దీంతో ఎస్ఐ వద్దకు వెళ్లి.. కారణం అడిగితే.. సంతకం పెట్టి తీసుకెళ్లి రేపు తీసుకురావాలని చెప్పటంతో వారు కంగుతిన్నారు.

అసలేం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం తెలుకొని స్కూల్  కు వెళ్లి ప్రిన్సిపల్ జగ్గారావును టీచర్లను నిలదీశారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లలు తప్పు చేశారని.. అయితే స్టేషన్ కు తీసుకెళ్లటం తప్పే అవుతుందని ఒప్పుకున్న టీచర్లు రాతపూర్వకంగా ఒప్పుకున్నారు. ఈ విషయం మీడియాలో రావటంతో కలెక్టర్ స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు విద్యార్థుల్ని విచారించారు. టీచర్లు తమను కొట్టి స్టేషన్ కు తీసుకెళ్లారని.. లాకప్ లో వేసినట్లుగా పేర్కొన్నారు. బాత్రూం కడగాలని.. చెడిపోయిన ఫ్యాన్ రెక్కలు సరిచేయమంటే చేశామని విద్యార్థులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ విషయంలో అసలుసిసలుట్విస్టు తర్వాత చోటు చేసుకుంది.

స్కూల్ టీచర్లు.. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన వేళ.. డ్యామేజ్ కంట్రోల్ కు తెరతీశారు స్థానిక డీఎస్సీ కేవీ సత్యనారాయణ. విద్యార్థుల్ని పోలీసులు కొట్టలేదని.. అవన్నీ అబద్ధాలని చెప్పుకొచ్చారు. కావాలంటే పిల్లల్ని అడగాలంటూ తమ సమక్షంలో వారిని ప్రశ్నించాలని మీడియాను కోరారు. తమను పోలీసులు కొట్టలేదన్న విషయాన్ని వారు చెప్పగా.. మరి కాళ్ల మీద తగిలిన దెబ్బలు ఎలా తగిలాయి? ఎవరు కొట్టారు? అన్న మీడియా ప్రశ్నలకు పిల్లలు సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. జరిగిన తప్పును ఒప్పుకొని శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఈ రీతిలో కవర్ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.