Begin typing your search above and press return to search.

టీడీపీ కి దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పింది అందుకేనట

By:  Tupaki Desk   |   14 Nov 2019 2:30 PM GMT
టీడీపీ కి దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పింది అందుకేనట
X
టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఈగ వాలితే దాని రక్తం కళ్ల చూసే వరకూ ఊరు కోనంత కమిట్ మెంట్ తో ఉండే దేవినేని అవినాష్.. టీడీపీ కి గుడ్ బై చెప్పటం పెను సంచలనమైంది. ఎందుకిలా జరిగింది? ఏ కారణాలు అవినాష్ పార్టీ ని వీడేలా చేశాయి? పార్టీ పట్ల తనకున్నకమిట్ మెంట్ ను ఎప్పటికప్పుడు ప్రదర్శించే ఆయన.. ఇప్పుడి లా ఎందుకు చేశారు? ఆ మద్యన బాబు ఇంటి మీద డ్రోన్ ఎగిరిన సమయం లో మిగిలిన నేతల స్పందన కు.. అవినాష్ స్పందనకు మధ్య వ్యత్యాసం అందరికి తెలిసిందే. అలాంటి నేత పార్టీకి గుడ్ బై చెప్పటానికి దారి తీసిన కారణాలేంటి? అన్న విషయం లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి.

ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన నెలల వ్యవధి లోనే పార్టీకి రాజీనామా చేసేసి.. వేరే పార్టీలో చేరేందుకు సిద్ధం కావటం వెనుక చాలానే కథ ఉందంటున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ కు కేటాయించింది. అయితే.. ఆ నియోజక వర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో ఉన్న కొడాలి నానికి ఉన్న ఫాలోయింగ్ మీద అవగాహన ఉన్న అవినాష్ పోటీ చేసేందుకు ఆసక్తి చూప లేదు. తాను పోటీ చేసేందుకు ససేమిరా అన్న పరిస్థితి.

అయితే.. దేవినేని అవినాష్ తప్పించి..కొడాలి నానిని ఓడించేందుకు మరెవరూ సరైన అభ్యర్థులు లేని కారణం గా అతన్నే బరిలోకి దించేందుకు ఒప్పించారు. ఫలితం ఎలా వచ్చినా దన్నుగా నిలుస్తామన్న హామీతో ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. బరిలో దిగే ముందు ఇచ్చిన హామీలు.. ఎన్నికల వేళలో ఎటో వెళ్లి పోవటం.. తనకు సాయంగా నిలుస్తామన్న బాబు అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

ఎన్నికల్లో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అవినాష్ చెప్పగా.. ముందు ఖర్చు చేయాలని ఎన్నికల తర్వాత పార్టీ ఆ విషయాల్ని చూస్తుందన్న హామీని నమ్మినట్లు సమాచారం. ఖర్చుకు ఆలోచించొద్దని బాబు చెప్పిన మాటల్ని నమ్మిన అవినాష్.. తన శాయశక్తులా కష్టపడ్డాడు. అయితే.. ఫలితం రాలేదు. తన శక్తికి మించి ఖర్చు చేసినప్పటికి ఫలితం సానుకూలంగా రాకపోగా 19,479 ఓట్ల తేడాతో ఓడి పోయిన దుస్థితి. దీంతో తీవ్ర ఆవేదన కు గురైన అతడ్ని సరైన రీతిలో ఓదార్చింది లేదని తెలుస్తోంది.

అన్నింటికి మించి ఎన్నికల సమయం లో తనకిచ్చిన హామీ విషయాన్ని చంద్రబాబు నెరవేర్చకపోగా.. ఆ మాటను తప్పించటం మొదలైందనట్లు సమాచారం. తానెన్ని కష్టాలు పడి ఖర్చు చేసిందన్న విషయాన్ని బాబుకు చెప్పటం తో ఆయన సర్దు బాటు చేస్తానని మాట ఇచ్చినా.. లోకేశ్ అందుకు అడ్డు పడినట్లు సమాచారం. అవినాష్ కు ఇస్తే.. చాలామందికి ఇదే రీతిలో ఇవ్వాల్సి వస్తుందని.. అది ఇబ్బంది గా మారుతుందన్న చినబాబు మాటల కు పెద బాబు సరేనన్నారట.

తనకే మాత్రం ఇష్టం లేకున్నా.. తన అభిమతానికి విరుద్దంగా బరిలోకి దించి తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిన పార్టీ అధి నాయకత్వం పై అవినాష్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన కష్టాల్ని పట్టించుకోకుండా ఉన్న పార్టీ లో తాను ఉండటం వేస్ట్ అన్న భావన కలిగినట్లు చెబుతున్నారు. ఇచ్చిన మాటను నిల బెట్టుకోవటంలో చంద్రబాబు తీరు ఆయన్ను బాధించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. విపక్ష నేతగా చంద్రబాబు చేస్తున్న తప్పులు.. అధికార పక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్న వైనంతో ఏపీ ప్రజల్లో బాబు మీద వ్యతిరేకత అంతకంత కూ పెరగటాన్ని అవినాష్ ప్రస్తావించినట్లు చెబుతారు. అయితే.. తన మాటలకు ఎలాంటి విలువ లేకపోవటం.. కమిట్ మెంట్ కు దక్కాల్సిన విలువ.. మర్యాద దక్కకపోవటం లాంటి కారణాలు ఆయన్ను పార్టీ నుంచి వీడిపోయేందుకు పురిగొల్పాయని చెబుతున్నారు.