ఆ హైకోర్టు ఆగ్రహం: బాబాలకు దానం ఇవ్వటానికి అమ్మాయిలు ఆస్తులా?

Sat Jan 29 2022 18:00:01 GMT+0530 (IST)

That High Court outrage Are girls assets to donate to baba

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా.. నాగరిక ప్రపంచంలో వినేందుకే ఎబ్బెట్టుగా అనిపించే ఒక ఉదంతానికి సంబంధించి ఒక రాష్ట్ర హైకోర్టు స్పందించిన వైనం సమంజసంగా ఉందని చెప్పాలి.  అధ్యాత్మిక ముసుగులో.. భక్తి పేరుతో మూఢత్వానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు సమంజసంగా ఉందని చెప్పక తప్పదు.ఒక బాబా మీద తనకున్న భక్తి భావంతో ఒక తండ్రి తన కుమార్తెను సదరు బాబాకు దానం చేయటం ఏమిటి? దానికి సదరు బాబా స్వీకరించటం ఏమిటి? అన్నది ప్రశ్న అయితే.. సదరు బాలికను తన సొత్తు అనుకున్న సదరు బాబా.. ఆమెపై అత్యాచారం చేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన కేసు విచారణ తాజాగా ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన పదిహేడేళ్ల బాలికను శంకేశ్వర్ ధక్నే అనే బాబాకు బాలిక తండ్రి దానం ఇచ్చారు. దీనికి సంబంధించి 2018లో దానపత్రం పేరుతో బాబాకు స్టాంప్ పేపర్ మీద రాసి దానం ఇచ్చారు. సదరు బాలిక తో బాబా.. అతని శిష్యుడు.. బాలిక తండ్రి  ఒక గుడిలో ఉండేవారు. అయితే.. 2021 ఆగస్టులో బాధిత బాలిక పోలీసుల వద్దకు వచ్చి తనను సదరు బాబా.. బాబా శిష్యుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపించి ఫిర్యాదు చేసింది.

దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. బెయిల్ కోసం నిందితులు కోర్టును ఆశ్రయించారు. దేవుడి సాక్షిగా బాలికను తమకు కన్యాదానం చేస్తున్నట్లుగా ఆమె తండ్రి రాసిచ్చిన వైనాన్ని బాబా కోర్టులో వాదించాడు.దీంతో స్పందించిన బాలిక.. తాను అప్పట్లో మైనర్ అని ఫిర్యాదులో పేర్కొందని.. రక్షణగా ఉండాల్సిన తండ్రి బాబాకు దానం చేయటం ఏమిటి? అని ప్రశ్నించింది.

బాలికను దానం చేయటానికి ఆమె ఏమీ వస్తువు కాదని మండిపడింది. బాలికను దానం చేయటం అనేది కలిచివేసే అంశంగా పేర్కొన్న న్యాయస్థానం.. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ అంశాన్ని త్వరగా విచారించాలని పేర్కొంది. బాలికకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని పరిశీలించాలని కూడా స్పస్టం చేసింది. అయితే.. నిందితులు ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ విచారణను ఫిబ్రవరి నాలుగుకు వాయిదా వేసింది. ఇలాంటి ఉదంతాల్లో నిందితులకు మరింత కాలం బెయిల్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.