Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాల ఓపెన్.. డేట్ ప్ర‌క‌టించిన ఠాక్రే!

By:  Tupaki Desk   |   26 Sep 2021 2:30 AM GMT
మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాల ఓపెన్.. డేట్ ప్ర‌క‌టించిన ఠాక్రే!
X
తీవ్ర రాజ‌కీయ ర‌భ‌స‌కు దారి తీసింది మ‌హారాష్ట్ర‌లోని ఆల‌యాల మూత‌. దేశంలో అత్య‌ధిక స్థాయిలో క‌రోనా కేసుల‌ను క్యారీ చేసిన రాష్ట్రం మ‌హారాష్ట్ర‌. తొలి వేవ్, రెండో వేవ్ ల‌లో మ‌హారాష్ట్ర‌లో రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. సెకెండ్ వేవ్ లో అయితే మ‌హారాష్ట్ర తీవ్ర ఇక్క‌ట్ల పాల‌య్యింది. ఇప్పుడు కూడా రోజువారీగా మూడు వేల స్థాయిలో కేసులు వ‌స్తున్నాయ‌క్క‌డ‌. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల స్థాయిలో ఉంది. అయితే మ‌హారాష్ట్ర ఇప్పుడ‌ప్పుడే రిలాక్స్ అయ్యే ప‌రిస్థితుల్లో లేదు. ఎందుకంటే.. సెకెండ్ వేవ్ అక్క‌డ ప్ర‌బ‌లిన తీరును గుర్తుంచుకుంటే, మ‌రాఠీలు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. వ‌చ్చే నెలలో అక్క‌డ ఆల‌యాలను తెరుస్తున్న‌ట్టుగా ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ ఏడో తేదీ నుంచి దేవాల‌యాల‌ను ఓపెన్ చేస్తున్న‌ట్టుగా, భ‌క్తులు కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తూ ద‌ర్శ‌నాలు చేసుకోవాల్సిందిగా ఆయ‌న సూచించారు. ద‌స‌రా ప్రారంభం సంద‌ర్భంగా ఆల‌యాల ఓపెన్ కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అక్క‌డ ఈ వ్య‌వ‌హారం బాగా రాజ‌కీయం అయిన సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆల‌యాలను త‌క్ష‌ణం తెర‌వాలంటూ గ‌త కొన్నాళ్లుగా బీజేపీ, మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన వంటి పార్టీలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ఈ విష‌యంలో ఆందోళ‌న‌ల‌తో రోడ్డుకు ఎక్క‌డ‌మే కాదు.. ప్ర‌భుత్వంపై రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. అలాగే గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి వినతిప‌త్రాల‌నూ ఇచ్చారు.

అయితే ఈ విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెన‌క్కు త‌గ్గ‌లేదు. ఆల‌యాలను తెర‌వాల‌ని డిమాండ్ చేస్తున్న బీజేపీ వాళ్లు ఈ విష‌యంలో కేంద్రాన్ని సంప్ర‌దించాల‌ని, కేంద్రం చేత చెప్పించాల‌ని శివ‌సేన‌, ఎన్సీపీలు ఎదురుదాడి చేశాయి. ముందుగా ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఆ ర‌కంగా స్పందించారు. అలాగే ఠాక్రే కూడా అదే రీతిన స్పందించారు. బీజేపీకి అంత ఉత్సాహంగా ఉంటే.. కేంద్రం చేత చెప్పించాల‌న్నారు. అయితే.. బీజేపీ ఆ విష‌యంపై స్పందించ‌లేదు. ప్ర‌భుత్వం మీద మాత్రం విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చింది.

ఆ విమ‌ర్శ‌ల‌ను, డిమాండ్ల‌ను ప‌ట్టించుకోని ఉద్ధ‌వ్ ఠాక్రే, ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఆల‌యాల‌ను మ‌ళ్లీ తెరుస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. భ‌క్తుల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పారు.