టీడీపీ అడ్రస్ కనబడటం లేదే ?

Wed Jul 21 2021 10:34:46 GMT+0530 (IST)

Telugu Desam Party MPs does not appear in Parliament

పార్లమెంటులో తెలుగుదేశంపార్టీ ఎంపిలు అడ్రస్ కనబడటం లేదు. పార్లమెంటు సమావేశాలకు ముందు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎంపిల సమావేశం జరిగింది. ప్రత్యేకహోదా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపిలు ఉద్యమించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆందోళనలకు వైసీపీ ఎంపిలు నాయకత్వం వహిస్తే తాము కూడా మద్దతిస్తామని ఎంపిల తరపున శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో చెప్పారు.ఇంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తే తాము కూడా రాజీనామాలు చేయటానికి రెడీగా ఉన్నామనే బంపర్ ఆఫర్ ఇచ్చారు. సరే రాజీనామాలపై టీడీపీ ఎంపి వేసిన గాలానికి వైసీపీ ఎంపిలు తగులుకోలేదు. ఎందుకంటే రాష్ట్రప్రయోజనాల కోసం రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపిలు అనుకుంటే అందుకు వైసీపీ ఎంపిల రాజీనామాలతో లింకు ఎందుకు ? టీడీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తామంటే ఎవరైనా వద్దన్నారా ?

ప్రత్యేకహోదా విషయంలో అప్పట్లో వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఇపుడు టీడీపీ ఎంపిలు కూడా రాజీనామాలు చేసేయచ్చు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కనీసం ఆందోళనల్లో కూడా ఎక్కడా కనబడటంలేదు. పార్లమెంటు సమావేశాలు మొదలైన దగ్గర నుండి వరుసగా రెండు రోజుల పాటు సభా సమావేశాలను స్తంబింపచేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇటు రాజ్యసభ అటు లోక్ సభలో వైసీపీ ఎంపిలు ఇంత రచ్చ రచ్చ చేస్తుంటే మరి టీడీపీ ఎంపిలు ఏమి చేస్తున్నట్లు ?  ఆందోళనలకు నేతృత్వం వహించాలని వైసీపీ ఎంపిలను డిమాండ్ చేసిన టీడీపీ ఎంపిలు ఏమయ్యారో తెలీటంలేదు. రెండు రోజుల్లో ఎప్పుడు కూడా సభల్లో కనబడకపోవటంతో అసలు టీడీపీ ఎంపిలు పార్లమెంటుకు హాజరవుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

బహుశా వైసీపీ ఎంపిలు ఎలాగూ కేంద్రానికి వ్యతిరేకంగా సభల్లో  ఏమీ చేయరన్న ధీమాతోనే టీడీపీ ఎంపి రెచ్చగొట్టినట్లున్నారు. అయితే ఊహించనిరీతిలో వైసీపీ ఎంపిలు ఆందోళనలు మొదలుపెట్టేసరికి టీడీపీ ఎంపిలు అడ్రస్ లేకుండా పోయారు. నరేంద్రమోడికి ఎక్కడ కోపమొస్తుందో అన్న భయమే టీడీపీ ఎంపిల్లో కనబడుతోందని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.