తెలంగాణ నూతన సచివాలయ టెండర్ షాపూర్‌జీ - పల్లోంజీ కి !

Thu Oct 29 2020 12:20:03 GMT+0530 (IST)

Telangana new secretariat tender for Shapoorji-Pallonji!

తెలంగాణ నూతన  సచివాలయాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్న సంస్థ పేరును గురువారం ప్రకటించనున్నారు. కొత్త సచివాలయ భవన సముదాయానికి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. ఆస్కార్ అండ్ పొన్ని అర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులు చేసి సీఎం ఖరారు చేశారు. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి గత నెలలో టెండర్లు ఆహ్వానించింది రోడ్లు భవనాల శాఖ. నిర్మాణ అంచనా వ్యయం రూ. 600 కోట్లతో టెండర్లు పిలిచింది. పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి.సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరించింది. కాగా బుధవారం కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఖరారు అయ్యాయి. ఆ టెండర్లని కమిషన్ ఆఫ్ టెండర్స్ ఖరారు చేసింది. కాగా ఈ టెండర్‌ని షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. రోడ్లు భవనాల శాఖ టెక్నికల్ బిడ్లను తెరిచి రెండు సంస్థలూ సాంకేతిక అర్హత సాధించినట్టు వెల్లడించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లను తెరిచేందుకుగాను టెండర్ వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కు పంపారు. ప్రాజెక్టు వ్యయం (రూ.450 కోట్లకు పైగా) దృష్ట్యా టెండర్లను ఆమోదించే అధికారం రోడ్లు భవనాల శాఖకు ఉండదు. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి ఎల్ 1 ను సీఓటీ ప్రకటించనుంది. అధికారికంగా గురువారం ప్రకటించనున్నప్పటికీ షాపూర్ జీ–పల్లోంజీ సంస్థనే తక్కువ కోట్ చేసి ఎల్ 1గా నిలిచిందన్న  ప్రచారం అధికారవర్గాల్లో సాగుతోంది. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ అధికారులను ప్రశ్నించగా వివరాలను గురువారం వెల్లడిస్తామని తెలిపారు . పది రోజుల్లో ఎల్1 సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి 12 నెలలోపు సచివాలయం కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఏ సమయం వరకు ఎంత పూర్తి కావాలో కూడా టార్గెట్ పెడతారు. దీన్ని బట్టి చూస్తే .. వచ్చే ఏడాది చివరి నాటికీ కొత్త సచ్చివాలయం పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.