కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేని పేకాట ఆడుతూ పట్టుబడిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు

Thu Jun 17 2021 16:00:01 GMT+0530 (IST)

Telangana minister brother arrested in gambling case

ఇటీవల తరచూ ఏదో ఒక ఇష్యూలో పేరు వినిపిస్తున్న మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడో సిత్రమైన తలనొప్పి వచ్చి పడింది. తన తప్పు ఏమీ లేకున్నా.. తాను బద్నాం అయ్యే పరిస్థితి. ఇప్పటికే వస్తున్న ఆరోపణలు.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం లేని పేకాట ఆడుతూ ఆయన సోదరుడు పోలీసులకు పట్టుబడటం.. అరెస్టు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డికి నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయనకు చెందిన ఫంక్షన్ హాల్లో ఆయన సోదరుడు పేకాటను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. కరోనా.. ఆపై లాక్ డౌన్ నేపథ్యంలో న్యూ బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫంక్షన్ హాల్లో కొందరు చట్టవిరుద్ధంగా పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.

దీంతో.. వెస్టు జోన్ టాస్క్ ఫోర్సు టీం దాడులు నిర్వహించింది. అందులో మంత్రి మల్లారెడ్డి సోదరుడు 66 ఏళ్ల నర్సింహారెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు మరో పదకొండు మంది కూడా పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. అనంతరం అరెస్టు చేసి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.1.4లక్షల క్యాష్.. 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.