Begin typing your search above and press return to search.

అయ్యో పాపం.. చావు రాసి పెట్టిందన్నట్లుగా చచ్చిపోయారే..

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:35 AM GMT
అయ్యో పాపం.. చావు రాసి పెట్టిందన్నట్లుగా చచ్చిపోయారే..
X
రాసి పెట్టిన మరణాన్ని ఎవరూ ఆపలేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతం వింటే ఈ మాటను కొట్టి పారేయలేరు. తమ దారిన తాము పోతున్న కారును వెనుక నుంచి లారీ గుద్దటం ఏమిటి? 200 మీటర్ల ఎత్తు మీద నుంచి కారు బండరాళ్ల మీద పడటం ఏమిటి? ఈ ప్రమాదం గురించి తెలిసి.. అక్కడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్ జారి పడి మరణించటం ఏమిటి? వరుస పెట్టి చోటు చేసుకున్న మరణాలు చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఈ ప్రమాదం గురించి విన్నవారంతా ఉలిక్కి పడటమే కాదు.. ఇలా జరగటమేమిటన్న విస్మయానికి గురి చేసే ఈ ఉదంతంలోకి వెళితే..

కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్.. స్వరూపలు భార్యభర్తలు. శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తుంటారు. ఆదివారం కావటంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కోసం భార్యతో కలిసి ఉదయం తొమ్మిది గంటలకు కారులో ఇంటి నుంచి బయలుదేరారు. కారు మానేరు వంతెనపైకి చేరుకునే వేళకు.. కరీంనగర్ నుంచి వస్తున్న లారీ వేగంగా కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టింది.

ఈ వేగానికి కారు అదుపు తప్పి మానేరు వంతెన రెయిలింగ్ ను ఢీ కొంది. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనలో కారు వంతెన పై నుంచి 200 మీటర్ల లోతులో ఉన్న బండరాళ్ల మీద పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవ్ చేస్తున్న శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. భార్య స్వరూపా గాయ పడింది. ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కరీంనగర్ వన్ టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా.. పొరపాటున వంతెన పై నుంచి కిందకు పడిపోయారు. దీంతో.. అతను తీవ్రంగా గాయపడ్డారు. 108లో గాయపడిన స్వరూప.. కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఇద్దరిని తరలించగా.. మార్గమధ్యంలోనే పోలీసు కానిస్టేబుల్ మరణించాడు. దైవ దర్శనం కోసం వెళుతూ ఒకరు.. ప్రమాదాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్ మరణం అక్కడి వారిని కలిచివేసింది.