Begin typing your search above and press return to search.

గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి, మోడీపై కేసీఆర్ ఫైర్

By:  Tupaki Desk   |   29 Aug 2022 12:30 PM GMT
గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. బండి, మోడీపై కేసీఆర్ ఫైర్
X
గుజరాతీ దొంగల బూట్లు మోసే సన్నాసులు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. వీరికేనా మనం రాజ్యాధికారం ఇచ్చేది అంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీతోపాటు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను కేసీఆర్ టార్గెట్ చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ తోపాటు టీఆర్ఎస్ భవన్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ సభలో మాట్లాడారు.

2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ దిశగా మనమంతా సన్నద్ధంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని రైతు వ్యతిరేక బీజేపీని పారద్రోలి రైతుల ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులంతా కోరారని.. మీటర్లు పెట్టే బీజేపీని ప్రారదోలాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారని.. నా వెంట ఉంటానన్నారని.. మీటర్లు పెట్టే బీజేపీపై పోరాటం చేద్దామన్నారని కేసీఆర్ అన్నారు.

దేశంలోని రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్ కేవలం 20.08 శాతం మాత్రమేనని.. ఈ విద్యుత్ కు కేవలం 1.45 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే బీజేపీకి రైతులు బుద్ది చెప్పాలని కేసీఆర్ కోరారు. ఒక కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కూడా కాదని.. రైతుల విద్యుత్ కోసం మోడీ ఖర్చు పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రైతులకు వ్యవసాయ మోటార్లకు ఎందుకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే.. మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని పోరాటం చేయాలని రైతు సంఘాల రెడీ కావాలని.. మోడీకే 2024 ఎన్నికల్లో మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు.

కేంద్రం 12 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టారని కేసీఆర్ విమర్శించారు. కానీ రైతులకు రూ.1.45 లక్షల కోట్లు ఖర్చు చేస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.

శ్రీలంకలో తన స్నేహితుడికి ప్రాజెక్టులు ఇప్పించినందుకు అక్కడికి వెళితే ‘మోడీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారని కేసీఆర్ ఆరోపించారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను మోడీ మోసం చేశారన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యం ఏరులై పారి.. కల్తీ మద్యానికి వందల మంది చనిపోతున్నారన్నారు.

దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారని.. గుజరాతీలకు బానిసలుగా పనిచేస్తున్నారని పరోక్షంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.

ఇక గజదొంగలు, లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. రక్తం ఏరులై పారడం మనకు అవసరమా? శాంతి నెలకొల్పే ప్రభుత్వం రావాలా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇప్పటికీ కేంద్రం తెలివితక్కువ విధానాలతో విదేశాల నుంచి గోధుమలు, బియ్యం దిగుమతి చేసుకుంటున్నామని.. ఇక్కడ మన రైతులు అమ్మితే కొనని దుర్మార్గ ప్రభుత్వం ఇదీ అని కేసీఆర్ ఆరోపించారు. అందుకే దేశ ఆర్థిక పరిస్థితిని, రూపాయి విలువను కేంద్రప్రభుత్వం దిగజార్చిందని కేసీఆర్ విమర్శించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.