ఖమ్మం ‘కారు’లో సరికొత్త రాజకీయం.. మాజీ ఎంపీకి తిప్పలు!

Mon Jul 19 2021 09:15:29 GMT+0530 (IST)

New politics in Khammam 'Trs'.

రాజకీయ నాయకుడి అంతిమ లక్ష్యం ఏంటీ అంటే.. సింగిల్ వర్డ్ ఆన్సర్ ‘ఎదగడం’. ఎక్కడిదాక..? ఆఖరి మెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడి దాకా! ఈ ప్రయాణంలో సహకరించే వారి చేత్తో మరో మెట్టు అందుకోవడం.. ఆ తర్వాత వారి భుజాలపై ఎక్కి తొక్కేసి ఇంకో మెట్టును చేరుకోవడం. అవసరమైతే వారి సీటులోనే కూర్చోవడం. దీన్ని అవకాశ వాదం అని కొందరంటారు.. నమ్మిన వాడిని మోసగించడం అని మరికొందరు అంటారు. ఎవరు ఏమన్నా.. అంతిమంగా అందలాన్ని అందుకోవడమే నాయకుడి ఏకైక సిద్ధాంతం. ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ ఇదే పనిచేస్తున్నారని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.రాములు నాయక్ మొదటి నుంచి రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి కాదు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. 2018 ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఈ విజయం కేవలం రాములు నాయక్ ది కాదని ఆయన వెనక అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని చెబుతారు పరిశీలకులు. అప్పట్లో పొంగులేటి హవా కొనసాగుతున్న వేళ.. రాములు నాయక్ వెంట నిలబడి మరీ.. గెలిపించారని అంటారు. ఆ విధంగా.. రాములు నాయక్ అంటే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి అనే ప్రచారం సాగింది. అంతేకాదు.. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములును.. పొంగులేటి స్వయంగా వెంటబెట్టుకెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు.

కానీ.. తర్వాత కాలంలో పరిస్థితులు మారిపోయాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో.. ఖమ్మం ఎంపీ సీటును టీఆర్ఎస్ అధిష్టానం పొంగులేటికి ఇవ్వలేదు. దీంతో.. ఆయన ఇప్పుడు గులాబీ నేతగా మాత్రమే ఉండిపోయారు. అదే సమయంలో పువ్వాడ అజయ్ వేగంగా ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో.. జిల్లా రాజకీయాలు వేగంగా మారిపోయాయి.

టీఆర్ ఎస్ లో ఎక్కడా లేని గ్రూపులు ఖమ్మంలో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తుమ్మల వర్గంతోపాటు పొంగులేటి వర్గాలను మంత్రి అజయ్ పట్టించుకోవట్లేదనే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్.. గ్రూపు మార్చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ దాటి.. మంత్రి అజయ్ గ్రూపులో చేరిపోయారని అంటున్నారు. అంతేకాదు.. పార్టీలోనూ పొంగులేటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మంత్రి పువ్వాడ డైరెక్షన్లో వైరా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని కూడా జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఇటీవల వైరా నియోజకవర్గంలోని మండలాల్లో టీఆర్ఎస్ ఇన్‌ఛార్జిల నియామకం జరిగింది. అయితే.. పొంగులేటి సూచించిన వారికి ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదని సమాచారం. మొత్తం.. అజయ్ వర్గానికి చెందిన వారినే నియమించారని టీఆర్ఎస్ లోనే చర్చ సాగుతోంది. ఒకరకంగా.. చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ లేకపోతే.. స్వతంత్ర అభ్యర్థిగా రాములు గెలిచే అవకాశమే లేదని అంటున్నారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ లాల్ తన మాట వినట్లేదని ఆయనకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే పొంగులేటి దగ్గరుండి మరీ రాములు నాయక్ ను గెలిపించారని అంటుంటారు జిల్లా రాజకీయ విశ్లేషకులు.

కానీ.. రాములు నాయక్ మాత్రం.. తనను గెలిపించిన పొంగులేటిని పక్కన పెట్టి.. మంత్రి క్యాంపులో చేరిపోయారని చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని ఇప్పుడు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాములు నాయక్ విషయంలో ఇది మరోసారి నిరూపితమైందని జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. జిల్లాలో పొంగులేటికి వ్యతిరేకంగా సాగుతున్న గులాబీ రాజకీయాల్లో రాములు నాయక్ సైతం చేరిపోయారని జనాలు అంటున్నారు.