Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరికను కాదని చెప్పేసిన ప్రధాన మీడియాసంస్థలు

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:46 AM GMT
కేసీఆర్ కోరికను కాదని చెప్పేసిన ప్రధాన మీడియాసంస్థలు
X
ఒక సమాచారం అధికార తెలంగాణ పార్టీలోనూ.. మీడియా వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజానిజాల మాట ఏమిటన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వనప్పటికీ.. అత్యున్నత స్థాయిలో జరిగిన సంప్రదింపులకు సంబంధించిన కొసరు సమాచారమే తాజా చర్చకు కారణమని మాత్రం చెప్పొచ్చు. ఇంతకూ విషయం ఏమంటే.. తిరుగులేని అధికార అధినేతగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక రిక్వెస్టును తెలంగాణలోని ప్రధాన మీడియా సంస్థల అధినేతలు సున్నితంగా నో చెప్పిన వైనం ఆసక్తికరంగా మారింది.

తాను కోరుకున్న దానిని తనకు తగ్గట్లుగా అందుబాటులోకి తెచ్చుకునే అలవాటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టాలెంట్ ఏమిటో అందరికి తెలిసిందే. అలాంటి ఆయన.. దసరా రోజున తన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనికి సంబంధించిన భారీ కవరేజ్ ను ఆయన ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆయనకు బడ్జెట్ సమస్యలు ఉన్నాయి? భవిష్యత్తు ఎలా ఉంటుందన్న సందేహాలతో పాటు.. వెంట నడిచే వారు గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు.

అలాంటి ప్రతికూల వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆయన.. అన్ని సంవృద్ధిగా ఉన్న వేళ.. తాను కోరుకుంటున్న కేంద్ర అధికారాన్ని సొంతం చేసుకోవటానికి అవసరమైన అన్నింటిని సమకూర్చుకొని.. రంగంలోకి దిగుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పటానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు తమకు పుష్కలంగా ఉన్నాయన్న విషయాన్ని మిగిలిన రాజకీయ పార్టీలకు అర్థమయ్యేందుకు వీలుగా విమానాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తమ పార్టీ శక్తియుక్తులు అర్థమయ్యేలా చేసేందుకు భారీ ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతలా ప్లాన్ చేసుకుంటూ రంగంలోకి దిగిన కేసీఆర్.. తన జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించిన కవరేజ్ భారీగా ఉండాలని భావించటం తప్పేం కాదు. కానీ.. ఈసారి ఆయన ఎంచుకున్న ముహుర్తం పెద్ద అడ్డంకిగా మారింది. ప్రింట్ మీడియాలో ఏడాది మొత్తంలో నాలుగు సందర్భాల్లో సెలవులు ఇవ్వటం తెలిసిందే. సంక్రాంతి.. వినాయకచవితి.. దసరా.. దీపావళి.. ఈ నాలుగు పర్వదినాల పక్కరోజున పత్రికలు పబ్లిష్ కాకపోవటం తెలిసిందే.

ఇదే ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందిగా మారింది. తన సొంత మీడియా సంస్థ ఉద్యోగులను తప్పనిసరిగా పండుగ రోజున మామూలు కంటే రెండు.. మూడు గంటల ముందే ఆఫీసులకు రావాలని చెప్పించారు. సొంత పత్రిక సిబ్బందికావటంతో కాదనలేక వస్తున్న పరిస్థితి. అదే సమయంలో పేరున్న ఈనాడు.. సాక్షి.. ఆంధ్రజ్యోతి సంస్థల యజమాన్యాలను కూడా ఈ దసరాకు సెలవు ఇవ్వకుండా.. తమకున్న అవసరాన్ని తీర్చేందుకు వీలుగా పని చేయాలని.. ఎడిషన్ తీసుకురావాలని కోరినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి రిక్వెస్టు పేరుతో సదరు మీడియా సంస్థల యాజమాన్యాల్ని సంప్రదించగా.. సెలవు విషయంలో వెనక్కి తగ్గితే తమకు ఎదురయ్యే ఇబ్బందులు ఎన్నో ఉంటాయని.. తాము సెలవును రద్దు చేయలేమని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఒకటికి రెండుసార్లు ప్రయత్నాలు చేసినా.. మీడియా యాజమాన్యాలు సానుకూలంగా స్పందించకపోవటంతో.. ఈ అంశాన్ని అక్కడితో వదిలేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలవును రద్దు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులతో పాటు.. భవిష్యత్తులు వచ్చే చిక్కుముడల నేపథ్యంలో సెలవును రద్దు చేయటం సాధ్యం కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన రిక్వెస్టుకు సానుకూల ఫలితం వస్తుందని ఆశించిన కేసీఆర్ అండ్ కోకు తాజా పరిణామం కాసింత నిరాశను కలిగించినట్లుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.