జగన్ ను ఆశాకానికెత్తేసిన టీ కాంగ్రెస్ నేత!

Wed Feb 26 2020 11:00:23 GMT+0530 (IST)

Telangana MLA all praise for CM YS Jagan Mohan Reddy

అధికారికంగా అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశాకానికెత్తారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కోమటిరెడ్డి ఆ తర్వాత మాట్లాడుతూ.. జగన్ ను ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితీరు అద్భుతంగా ఉందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాబోయే ఇరవై సంవత్సరాలూ జగన్ ఏపీకి సీఎంగా కొనసాగగలరు అని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిపై ఈ కాంగ్రెస్ నేత ప్రశంసలు కురిపించారు.గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరదూరంగానే ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే వేరే పార్టీ తీర్థమేదీ పుచ్చుకోలేదు. ఇక ఇప్పుడు మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగబోతున్నారనే వార్తలూ వస్తున్నాయి. ఇటీవలే ఆయన సీఎల్పీ సమావేశానికి కూడా హాజరయ్యారు. తద్వారా పార్టీకి మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లారు ఆయన. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకుని అనంతరం రాజకీయం గురించి మాట్లాడారు. వైఎస్ జగన్ ను ప్రశంసించారు.

కోమటిరెడ్డి సోదరులకు వైఎస్ కుటుంబం తో ఉన్న అనుబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. వైఎస్ వల్లనే వీరు రాజకీయంగా ఎదిగారు. అనంతరం ఆయనకు శిష్యులుగా మెలిగారు. వైఎస్ మరణానంతరం జగన్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే వీరు తెలంగాణ ఉద్యమం వైపు వెళ్లి పోవడంతో రూటు మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడినా.. కోమటిరెడ్డి సోదరులు మాత్రం ఎలాగోలా గెలుస్తూ వస్తున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ పై మాత్రం ఫుల్ పాజిటివ్ గానే స్పందిస్తూ తమ పాతబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఉన్నారు.