మంచిపని చేసి మైలేజీ లేకపోవటం ఉత్తమ్ కే సాధ్యం

Fri May 29 2020 09:30:53 GMT+0530 (IST)

Telangana Congress arranges buses for migrant workers

ఎంత మంచి మెడిసిన్ అయినా సరే.. సరైన సమయంలో ఇవ్వకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సామాన్యుడికి ఈ విషయం అర్థం కాదనుకుందాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారధిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతకు సైతం తెలీకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మాయదారి మహమ్మారి పుణ్యమా అని కలలో కూడా చూడని ఎన్నో ఉదంతాల్ని.. పరిణామాల్ని నిత్యం చూస్తున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో అందరి గుండెల్ని పిండేసేలా చేసింది మాత్రం వలసకూలీల వెతలు చూసినప్పుడే.చుర్రుమనే ఎండలో వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్లటం.. మార్గమధ్యంలోనే కొందరు అనారోగ్యం పాలైతే.. మరికొందరు మరణించారు కూడా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకు.. ఒక విపత్తు విరుచుకుపడితే కోట్లాది పేదలకు కష్టం కలగకుండా చేయటంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయా? అంటే అవుననే మాట వస్తుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో వలస కార్మికుల్ని వారి ఊళ్లకు తరలించే విషయంలో రాష్ట్ర సీఎం కేసీఆర్ యాక్టివ్ గా వ్యవహరించారనే చెప్పాలి.

పలు రాష్ట్రాలకు శ్రామిక్ రైళ్లను నడపటం ద్వారా వేలాది మందిని వారి సొంతూళ్లకు పంపగలిగారు. అయితే.. ఇదే పని మరికాస్త ముందుగా చేసి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. కేంద్రం రైళ్లు నడపకున్నా.. ప్రైవేటు వాహనాల్లో వారి సొంతూళ్లకు తరలించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. నిజానికి ఇలాంటి పనులు ప్రభుత్వం చేసేందుకు వీలుగా విపక్షం ఒత్తిడి తెస్తుండాలి. కానీ.. తెలంగాణలో అలాంటి ప్రయత్నం జరగలేదు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ఒడిశాలో దింపి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ బస్సు గాంధీ భవన్ నుంచి బయలుదేరి వెళ్లింది. ఇంత మంచి పని చేసి మైలేజీ పొందలేకపోవటం చూస్తే.. ఉత్తమ్ చేసుకున్నదేనని చెప్పాలి. ఇలాంటి పనిని.. శ్రామిక్ రైళ్ల కంటే ముందే పంపించి ఉంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటంతో పాటు.. ఆ తర్వాత వారిని తరలించే కార్యక్రమం చేపడితే.. దానికి సంబంధించిన మైలేజీ కాంగ్రెస్ ఖాతాలో పడేది. అలాంటివేమీ లేకపోగా.. తాము చేసిన మంచి పనికి సైతం మైలేజీ పొందలేని పరిస్థితి. ఎంత మంచి పనైనా.. టైమ్లీగా చేయకపోవటం ఉత్తమ్ అండ్ కో ఫెయిల్యూర్ గా చెప్పక తప్పదు.