పవన్ పూటకొక మాట మారుస్తున్నారు !

Mon Jan 20 2020 16:07:29 GMT+0530 (IST)

Telangana Congress Leader V Hanumanth Rao Fires On Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ..అధికారం నా లక్ష్యం కాదు ..ప్రజలకి మంచి జరగడమే నా అంతిమలక్ష్యం అంటూ జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఆ నాటి నుండి నేటి వరకు కూడా అయన ఒకే మాట పై నిలబడిన సందర్భాలు లేవు. ఏ వానకి ఆ గొడుగు అన్నట్టు పవన్ కళ్యాణ్ అప్పటికి పబ్బం గడపటానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలామందికి అర్థమైంది. అందుకే గత ఎన్నికలలో జనసేనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. రాజకీయాలలో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట పై నిలబడాలి అదే మాట కోసం ఎవరినైనా ఎదురించి సాధించి చూపెట్టాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మధ్య కాలంలో ఎన్నోసార్లు యుటర్న్స్ తీసుకున్నారు.ఇక తాజాగా జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ముందుకు వెళ్లాలనే నిర్ణయం పట్ల అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ఇదే వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. బీజేపి సిద్దాంతాన్ని వ్యతిరేకించిన పవన్ ఎన్నో రకాలుగా ఆ పార్టీ పైన ఆరోపణలు గుప్పించారని అలాగే ఒక సందర్బంల్లో ప్రధాని మోదీని కూడా పవన్ కళ్యాణ్ అమరావతి విషయం లో పాచిన పోయిన లడ్డూలిచ్చారని ఘాటుగా విమర్శించారు అని కొంతమంది నేతలు గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా జనసేన-బీజేపి పొత్తుపై స్పందించారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన భవిశ్యత్తులో అంతర్జాతీయ పార్టీ గా ఎదిగే అవకాశం ఉందని కేటీఆర్ చమత్కరించారు. ఇక ఇదే అంశం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు. ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయం లో బీజేపిని విమర్శించిన పవన్ పవన్ కళ్యాణ్ నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన బీజేపి పొత్తు పట్ల ఏపి ప్రజలు స్పందించి ఆ పార్టీల భవితను నిర్ణయిస్తారని అయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.