Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు విఫ‌లం.. కేసీఆర్ స‌క్సెస్ అవుతారా?

By:  Tupaki Desk   |   14 Aug 2022 6:33 AM GMT
చంద్ర‌బాబు విఫ‌లం.. కేసీఆర్ స‌క్సెస్ అవుతారా?
X
దేశంలో ఎన్నిక‌ల్లో పేప‌ర్ బ్యాలెట్‌కు బ‌దులుగా ఈవీఎం మెషిన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి వాటి ప‌నితీరుపై ప‌లు పార్టీల అధినేత‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు. ఈవీఎంల‌ను మానిప్యులేట్ చేయ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని.. నిపుణులు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నార‌ని ఆయా పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంల ద్వారా ఏ పార్టీకి ఓటేసినా అధికారంలో ఉన్న పార్టీకో లేదా వాటిని మానిప్యులేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన పార్టీకో వెళ్లిపోతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి.

అయితే ఈ ఆరోప‌ణ‌లను కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూ వ‌స్తోంది. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన పార్టీలే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌ప్పుబ‌డుతోంది. ఈవీఎం మెషిన్ల‌ను ట్యాంప‌ర్ చేయ‌డం, మానిప్యులేట్ చేయ‌డం వంటివి కుద‌ర‌ద‌ని.. కావాలంటే ఏ సాంకేతిక నిపుణుడినైనా తెచ్చుకుని నిరూపించాల‌ని స‌వాల్ కూడా చేసింది. అయినా స‌రే ఇప్ప‌టికీ ఈవీఎంల‌పై ఆయా పార్టీల‌తోపాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ సందేహాలు నెల‌కొన్నాయి.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో 21 పార్టీల అధినేత‌లు న్యూఢిల్లీలో స‌మావేశ‌మ‌య్యారు. ఈవీఎంల‌ను కాకుండా వీవీ ప్యాట్స్‌ను లెక్కించాల‌ని నేత‌లంతా ఆ స‌మావేశంలో డిమాండ్ చేశారు. ఒక‌వేళ వీవీప్యాట్స్ స్లిప్పులు..ఈవీఎంలో లెక్క‌లు స‌మానంగా లేకుంటే మొత్తం లెక్కించాల‌ని డిమాండ్ చేశారు. కౌంటింగ్ ప్ర‌క్రియలో భాగంగా ముందు వీవీప్యాట్స్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని..అవి పూర్త‌యిన త‌రువాత‌నే ఈవీఎంల‌ను లెక్కించాలని డిమాండ్ చేశారు. అయితే వారు కోరిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌ల సంఘం వారి డిమాండ్‌ను తోసిపుచ్చింది.

ఇక ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఒంటి కాలితో కేసీఆర్ లేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ విధానాల‌ను దునుమాడుతున్న ఆయ‌న వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. కేంద్రంపై, బీజేపీపై పోరుకు క‌ల‌సి రావాల‌ని కోరుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కూడా ఇప్పుడు ఈవీఎంల‌పై పోరు చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబు మాదిరిగానే ఈవీఎంల‌ను తొల‌గించి బ్యాలెట్ ద్వారా ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌బోతున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో చంద్ర‌బాబు మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో స‌హా అన్ని పార్టీల మ‌ద్ద‌తును కేసీఆర్ కూడ‌గ‌ట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. అయితే ఓడిపోతాన‌నే భ‌యం వ‌ల్లే కేసీఆర్ ఆ నెపాన్ని ఈవీఎంల‌పైకి నెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

గ‌తంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ వ‌రుస‌గా రెండుసార్లు అదికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డ స‌మాజ్‌వాదీ పార్టీతోపాటు ప‌శ్చిమ బెంగాల్ లోని తృణ‌మూల్ కాంగ్రెస్, ఇత‌ర పార్టీలు కూడా ఈవీఎంల‌ను బీజేపీ మానిప్యులేట్ చేసింద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయ‌ని బీజేపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఆడ‌లేక మ‌ద్దెల ఓటిద‌న్న‌ట్టు కేసీఆర్ వ్య‌వ‌హార శైలి ఉండ‌బోతోంద‌ని నిప్పులు చెరుగుతున్నారు.

ప్రాంతీయ పార్టీలు, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్నిక‌ల్లో గెలిస్తే బీజేపీపై ప్ర‌జ‌ల తిరుగుబాటుకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని, మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌కు చెంపపెట్ట‌ని ప్ర‌చారం చేస్తున్నాయ‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. అలా కాకుండా ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందంటూ నీచ రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. మ‌రి ఈవీఎంల‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కేసీఆర్ విజ‌యం సాధిస్తారా లేక ఓడిపోతారా అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.