ప్రతి గింజా కొంటాం... కేంద్రం పెత్తనం ఎందుకు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Wed May 18 2022 20:03:52 GMT+0530 (IST)

Telangana CM KCR

నిన్న మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో కయ్యానికి దిగిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎట్టకేలకు.. తనే కొంటానని హామీ ఇచ్చారు. తడిసిపోయిన ధాన్యం సహా రాష్ట్రంలోని ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని.. తాజాగా ఆయన ప్రకటించారు. వరిధాన్యం సేకరణపై   కేసీఆర్ హైదరాబాద్ ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వెనకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలే! అని చెప్పారు.తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని... ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్... రైతులకు భరోసాని చ్చారు. హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం గన్నీ బ్యాగులు రవాణా మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని సీఎం స్పష్టం చేశారు.

ఎంత ఖర్చయిన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె పట్టణ ప్రగతి అమలు సహా.. బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. వైకుంఠధామాలు సమీకృత వెజ్- నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు వరి ధాన్యం సేకరణపై సమాలోచనలు చేశారు. రాష్ట్రాలు స్థానికసంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుపట్టారు.

రాష్ట్రాలపై టోపీ పెడతారా!

75 సంవత్సరాల అమృత్ మహోత్సవాల నేపథ్యంలోనూ... దేశంలోని కొన్ని పల్లెలు పట్టణాలు కరెంటు లేక చీకట్లలో మగ్గుతున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాగు సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారని వ్యాఖ్యానించారు. విద్య వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని...కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం అర్ధరహితమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలపై కుచ్చు టోపీ పెట్టే విధంగా వ్యవహరిస్తోందని.. దీనిని తాను ప్రశ్నించినందుకే.. కేంద్ర మంత్రులు క్యూ కట్టుకుని వచ్చి.. యాగీ చేశారని.. దుయ్యబట్టారు.