Begin typing your search above and press return to search.

పర్ ఫెక్ట్ పంచ్: 'ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు'

By:  Tupaki Desk   |   31 March 2023 10:06 AM GMT
పర్ ఫెక్ట్ పంచ్: ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు
X
మరికొద్ది నెలల్లో ముంచుకొస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గులాబీ దళం అప్రమత్తమైనట్లుగా ఉంది. తమ ప్రధాన ప్రత్యర్థి బీజపీ దూకుడుకు కళ్లాలు వేసేందుకు తమన అమ్ములపొదిలో ఉన్న ఒక్కో అస్త్రాన్ని తెలివిగా బయటకు తీస్తూ.. కమలనాథుల్ని తికమకకు గురి చేస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ మహానగరంలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని పోస్టర్లు వేసిన ఐడియాకు ఆదరణ లభించటం.. బీజేపీ అండ్ కోలు ఆత్మరక్షణలో పడుతున్న వేళ.. ఇప్పుడీ ఐడియాను జిల్లాలకు తీసుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజపీ ఎంపీలుగా సంచలన విజయం సాధించటం తెలిసిందే. ఇందులో భాగంగా నాటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోవటం తెలిసిందే. ఈ పరాభవం గులాబీ బాస్ ను పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. సొంత కుమార్తెను గెలిపించుకోలేకపోయారన్న విమర్శ బలంగా వినిపించింది. ఈ షాక్ నుంచి తేరుకోవటానికి కొంతకాలం పట్టిన పరిస్థితి.

అయితే.. ఈ ఓటమిలో పసుపు బోర్డు కీలకంగా పని చేసిందన్న విషయం తెలిసిందే. తాను ఎంపీగా గెలిస్తే.. ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ల మీద రాసిన డీఎస్ అర్వింద్ మాటల్ని నమ్మిన పసుపు రైతులు గుండుగుత్తుగా ఓట్లు వేయటంతో నిజామాబాద్ ఎంపీ స్థానం గులాబీ పార్టీ నుంచి చేజారింది. అయితే.. కేంద్రం అనుసరించిన విధానంతో పసుపు బోర్డు నిజామాబాద్ కు రాకుండా పోవటం గులాబీ దళానికి ఇప్పుడో అస్త్రంగా మారింది. తాజాగా నిజామాబాద్ నియోజకవర్గంలోని పలు చోట్ల.. హటాత్తుగా ప్రత్యక్షమైన పసుపు బోర్డులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టారంటూ.. రైతులు కన్నెర్ర చేస్తున్న వైనాన్ని తెలియజేస్తూ.. రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున పసుపు బోర్డులు ఏర్పాటైన వైనం అందరిని ఆకర్షిస్తోంది. గోడలకు పసుపు రంగులో ఉన్న ఫ్లెక్సీల్లో ''పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు'' అంటూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు వెనుక గులాబీ పార్టీనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇటీవల కాలంలో మోడీని టార్గెట్ చేయటం.. అందులో భాగంగా భారీగాపోస్టర్లతో యుద్ధాన్ని షురూ చేసిన గులాబీ దళం.. ఇప్పుడు పసుపు బోర్డులతో షురూ చేసిన సరికొత్త ప్రచారం సానుకూలంగా మారుతుందంటున్నారు. రానున్న రోజుల్లో కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదన్న విషయాన్ని తెలియజేసేలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారని.. ఇందుకు పసుపు బోర్డులు లాంటి కాన్సెప్టులను తెర మీదకు తీసుకొస్తారని చెబుతున్నారు. మరి.. ఈ పసుపు బోర్డుల కాన్సెప్టుకు.. బీజేపీ వర్గాలు ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి.