Begin typing your search above and press return to search.

కుర్ర కిషన్.. పిల్ల చేష్టలొద్దు.. టీమిండియా యువ కీపర్ల లొల్లి

By:  Tupaki Desk   |   23 Jan 2023 5:55 PM GMT
కుర్ర కిషన్.. పిల్ల చేష్టలొద్దు.. టీమిండియా యువ కీపర్ల లొల్లి
X
ఏమిటో.. టీమిండియాకు ఇటీవల కాలంలో వికెట్ కీపర్ల తలనొప్పి పట్టుకుంది. ఒకరి వెంట ఒకరు వార్తల్లో నిలుస్తున్నారు. పాజిటివ్ గానో.. నెగెటివ్ గానో ఏదో రకంగా పతకా శీర్షికలకు ఎక్కుతున్నారు. గత నెల చివర్లో యువ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతడు ప్రాణాలతో బయటపడడం అంటే లక్ అనేంత స్థాయిలో ఉంది ఆ ప్రమాదం. మరోవైపు కేరళ కుర్రాడు సంజూ శాంసన్ లొల్లి. నిలకడగా ఆడుతున్నప్పటికీ సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వరంటూ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం.

అటు చూస్తే సంజూ వచ్చిన అవకాశాలను జారవిడుస్తున్నాడు. పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్. బంగ్లాదేశ్ పై వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. అయితే, అతడికి తాజాగా న్యూజిలాండ్ తో టి20 సిరీస్ లో తుది జట్టులో చోటుదక్కలేదు. వన్డేల్లో మాత్రం రాహుల్ అందుబాటులో లేకపోవడంతో అవకాశం చిక్కింది. ఇలా ముగ్గురు ఫ్రంట్ లైన్ కీపర్లూ తరచూ వార్తల్లో నిలవడం గమనార్హం.

హైదరాబాద్ లో కొద్దిలో నిషేధం మిస్..

న్యూజిలాండ్ తో తొలి వన్డేలో పెద్దగా రాణించని కిషన్.. తక్కువ స్కోర్ల మ్యాచ్ అయిన రెండో వన్డేలో చివర్లో వచ్చాడు. అయితే, కిషన్ పెద్ద గండం నుంచి గట్టెక్కాడు. ఒకటీ, రెండు కాదు 12 వన్డేల నిషేధాన్ని అతడు తప్పించుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ బ్యాటింగ్ చేస్తుండగా.. కీపింగ్ గ్లోవ్స్‌తో బెయిల్స్ కిందపడేశాడు. ఇది కీపర్లంతా చేసే పనే అయినా.. కిషన్ ''హిట్ వికెట్'' అంటూ అప్పీల్ చేయడం గమనార్హం.

అంపైర్ పసిగట్టాడు

కిషన్ తుంటరి పనిని రిప్లేలను పలు కోణాల్లో పరిశీలించి టీవీ అంపైర్ పసిగట్టాడు. కాగా, ఇక్కడో మెలిక ఉంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా టామ్ లాథమ్ ఇలానే చేశాడు. అప్పుడు టీవీ అంపైర్ హార్దిక్ పాండ్యాను ఔట్ అని తేల్చాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. అది తప్పుడు నిర్ణయం అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ అన్నట్లు కిషన్‌ చేసిన పనిని కొందరు ప్రశంసించారు. కానీ, గావాస్కర్ వంటి దిగ్గజం తప్పుబట్టాడు. చిత్రమేమంటే ఆ సమయంలో కామెంట్రీ చెబుతున్నది ఆయనే.

పిల్ల చేష్టలంటూ ధ్వజం.. ఐసీసీకి ఆగ్రహం

కిషన్ వి పిల్ల చేష్టలని.. ఇది క్రికెట్ తీరు కాదని గావస్కర్ మండిపడ్డాడు. సరదా కోసం చేసినప్పుడు ఇషాన్ అప్పీల్ చేయాల్సింది కాదని మరో వ్యాఖ్యాత మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఐసీసీ ఈ ఘటనపై కన్నెర్ర చేసింది. మ్యాచ్‌‌కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్.. కిషన్‌ను మందలించాడు. నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎవరైనా క్రికెటర్ అంపైర్లను తప్పుదోవ పట్టిస్తే కఠిన శిక్షలుంటాయి. అదికూడా తప్పు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.15 ప్రకారం.. కిషన్ చేసినది లెవల్ 3 నేరం. కొన్ని సందర్భాల్లో దీనికిగాను ఆటగాడి మీద 4 నుంచి 12 వన్డేల వరకూ నిషేధం విధించే ప్రమాదం ఉంది.

అంపైర్లు తేలిగ్గా తీసుకోవడంతో..

వాస్తవానికి కిషన్‌పై నాలుగు వన్డేల నిషేధం తప్పదని న్యూజిలాండ్ మీడియాలో కథనాలు వచ్చాయి. రిఫరీ జవగళ్ శ్రీనాథ్ మాత్రం మందలించి వదిలేశాడు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే కఠిన శిక్ష విధిస్తామని మాత్రం హెచ్చరించాడు. కాగా, శ్రీనాథ్ చర్యలు తీసుకోకపోవడానిక మరో కారణం కూడా ఉంది. ఘటనపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు అనిల్ చౌదరి, నితిన్ మీనన్‌ ఫిర్యాదు చేయకపోవడమే ఆ కారణం. అలా మైదానంలోని అంపైర్ల చలవతో కిషన్ బతికిపోయాడు. అయితే.. అంపైర్లు కూడా ఈ ఘటనను సరాదాగా భావించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.        



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.