Begin typing your search above and press return to search.

గాయాలు.. ఓటములు.. వైఫల్యాలు.. బీసీసీఐ సమీక్ష.. టీమిండియాలో అనిశ్చితి

By:  Tupaki Desk   |   10 Dec 2022 1:30 PM GMT
గాయాలు.. ఓటములు.. వైఫల్యాలు.. బీసీసీఐ సమీక్ష.. టీమిండియాలో అనిశ్చితి
X
జట్టును గెలిపించేదెవరో తెలియడం లేదు.. చిన్న జట్టు మీద కూడా ఓటములు.. ఆటగాళ్లకు గాయాలు.. సీనియర్ల పేలవ ఫామ్.. నిలదొక్కుకోని జూనియర్లు.. ఇదీ ప్రస్తుతం టీమిండియా పరిస్థితి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పర్యటన తర్వాత బీసీసీఐ సమీక్ష చేపట్టనుండడం ఆసక్తి రేపుతోంది. టి20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి, సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోవడం నుంచి బంగ్లాదేశ్ కు వన్డే సిరీస్ చేజార్చుకోవడం వరకు జట్టు ప్రదర్శన అభిమానులకు ఏమాత్రం మింగుడుపడని వేళ ఇది కీలక పరిణామం. దీంతో బీసీసీఐ ఏం చేస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తాకిడికి బోర్డు దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

బంగ్లాదేశ్‌ పర్యటన పూర్తి కాగానే బీసీసీఐ కార్యవర్గం.. జట్టు యాజమాన్యం, ప్రధాన ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవలి పరాభవాలపై వివరణ కోరడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన, సెలక్షన్‌ తదితర అంశాలపై సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ''ప్రపంచకప్‌ ముగియగానే సమీక్ష నిర్వహించాలనుకున్నాం. కానీ కొందరు ఆఫీస్‌ బేరర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడింది'' అని ఓ అధికారి చెప్పారు. దీన్నిబట్టి ఏదో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జట్టుతో ముందుకెళ్తే పదినెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో విజేతగా నిలవడం కష్టమనే బీసీసీఐ సమీక్ష చేపట్టినట్లు తెలుస్తోంది.

కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ తాజా వివరాలు వెల్లడించింది. శనివారం నాటి మూడో వన్డేకు రోహిత్ శర్మ, కుల్దీప్‌ సేన్, దీపక్ చాహర్ దూరం కానున్నారు. జట్టులోకి కుల్‌దీప్‌ యాదవ్‌ వచ్చేశాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకం సాధించాడు. 'రెండో వన్డే మ్యాచ్‌ సందర్భంగా బంగ్లా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో స్కానింగ్‌ తీయించుకొని వచ్చాడు.

తదుపరి చికిత్స కోసం రోహిత్ ముంబయికి వెళ్లాడు. దీంతో శనివారం జరిగే మూడో వన్డేలో ఆడడు. అయితే టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే కుల్దీప్‌సేన్, దీపక్ చాహర్‌ కూడా చివరి వన్డేకు అందుబాటులో ఉండరు. మొదటి వన్డే ముగిసిన తర్వాత కుల్దీప్‌ సేన్ వెన్ను నొప్పిగా ఉన్నట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకొచ్చాడు. అందుకే రెండో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చాం. వైద్య బృందం సూచనల మేరకు చివరి మ్యాచ్‌కూ రెస్ట్‌ ఇచ్చాం. దీంతో దీపక్ చాహర్‌తో పాటు కుల్దీప్‌ ఎన్‌సీఏకి వెళ్తారు'' అని బీసీసీఐ
వెల్లడించింది.

వారు టెస్టులకూ దూరం

గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కు పేసర్‌ మహమ్మద్‌ షమీ దూరమైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా అందుబాటులో లేడు. అయితే.. డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాతో టెస్టు సిరీస్‌లో వీరిద్దరూ ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోని నేపథ్యంలో ఈ సిరీస్‌కు సైతం వీరు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వీరి స్థానాలను భర్తీ చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్ టెస్టు సిరీస్‌లో జడేజా స్థానంలో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. మహమ్మద్‌ షమీ స్థానంలో పేసర్‌ నవదీప్‌ సైనిని జట్టులోకి తీసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌- ఎతో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్‌ పర్యటనలో ఉన్నారు. సౌరభ్‌ రంజీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. దిగువ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఇతడు ఆడగలడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో 39 పరుగులు చేసి రాణించాడు. షమీ స్థానంలో నవదీప్‌ సైనికి అవకాశం వస్తే.. ఉమేశ్‌ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌తో కలిసి సీమ్‌ బౌలింగ్‌ ఎంపికల్లో ఒకడిగా చేరనున్నాడు. మీర్పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బొటనవేలి గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండేది అనుమానమే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.