Begin typing your search above and press return to search.

బిగ్ షాక్.. టెస్టుకు 6 రోజుల ముందు.. రోహిత్ కు పాజిటివ్

By:  Tupaki Desk   |   26 Jun 2022 7:30 AM GMT
బిగ్ షాక్.. టెస్టుకు 6 రోజుల ముందు.. రోహిత్ కు పాజిటివ్
X
ఎప్పుడో 15 ఏళ్ల కిందట తొలిసారి ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ గెలిచి.. మళ్లీ అలాంటి సువర్ణావకాశం ముంగిట నిలిచిన టీమిండియాకు అతి పెద్ద షాక్. కెప్టెన్ రోహిత్ శర్మ కొవిడ్ బారినపడ్డాడు. అది కూడా జూలై 1 న జరగాల్సిన ఐదో టెస్టుకు ఐదు రోజుల సమయం కూడా లేని పరిస్థితుల్లో. దీంతో అతడు టెస్టు మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది.

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇప్పటికే గాయంతో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేయాల్సింది. ప్రత్యామ్నాయ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బెంగళూరులోనే ఉండిపోయాడు. అతడిని
జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. ఒక్కటే టెస్టు ఉన్నందున ఇంగ్లండ్ పంపలేదు.

మరిప్పుడు బీసీసీఐ ఏం చేయనుందో చూడాలి. రోహిత్ కోలుకుని బరిలో దిగుతాడా? అంటే ఐదు రోజుల్లోనే నెగెటివ్ వస్తుందని చెప్పలేం. ఒకవేళ వస్తే రావొచ్చు కానీ.. మ్యాచ్ ఫిట్ నెస్ సంగతేమిటో చెప్పలేం. ఇక హుటాహుటిన మయాంక్ అగర్వాల్ ను ఇంగ్లండ్ పంపడమే మిగిలింది.

కోలుకోకుంటే కెప్టెన్ ఎవరు...? వైస్ కెప్టెన్ రాహుల్ కూడా అందుబాటులో లేడు కాబట్టి ... రోహిత్ కు నెగెటివ్ వచ్చి టెస్టు బరిలో దిగకుంటే.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్‌ పంత్‌ లేదా పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా కెప్టెన్సీ చేసే వీలుంది. కాగా, రోహిత్‌ శర్మకు శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అతడు టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

వార్మప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం టీమిండియా లీస్టర్ షైర్ తో ఇంగ్లండ్ లో సన్నాహక మ్యాచ్ ఆడుతోంది. అయితే, తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 25 పరుగులు చేశాడు. శనివారం రెండో ఇన్నింగ్స్‌ లో బ్యాటింగ్‌కు రాలేదు. ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ ఓపెనింగ్ కు దిగాడు. మరోవైపు రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం బ్యాటింగ్ కు దూరంగానే ఉన్నాడు. కెప్టెన్, ఓపెనర్ అయిన రోహిత్ ఇలా చేయడం కాస్త అనుమానానికి తావిచ్చింది. కానీ.. పెద్దగా పట్టింపులోకి రాలేదు. చివరకు అతడికి అనారోగ్యమే కారణమని తేలింది.

నిన్న కోహ్లి.. నేడు రోహిత్.. జాగ్రత్తలు విస్మరిస్తే ఇలానే.. ప్రస్తుతం భారత్ తో పాటు చాలాచోట్ల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అసలు ఇంగ్లండ్ లో ఇప్పటికీ 10 వేల కేసులొస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ, భారత క్రికెటర్ల బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పడు కనీసం మాస్క్ కూడా ధరించడం లేదని తెలుస్తోంది. కాగా, భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లేముందు మాల్దీవుల్లో గడిపిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం కొవిడ్ బారినపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అతడు కోలుకుని మళ్లీ జట్టుతో చేరడంతో విషయం అంతగా పట్టింపులోకి రాలేదు. మరిప్పుడు ఏకంగా రోహిత్ కే పాజిటివ్ వచ్చింది.

రోహిత్ ఒక్కడికేనా? ఇంకొందరికీనా? టీమిండియాలో ప్రస్తుతానికి రోహిత్ ఒక్కడికే వైరస్‌ సోకిందని అంటున్నా.. ఇంకెవరికైనా పాజిటివ్ వచ్చిందా? అనే అనుమానాలూ ఉన్నాయి. వార్మప్‌ మ్యాచ్‌కు ముందు అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రస్తుతం బయోబబుల్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఏమీ లేదు. దీంతో పలువురు ఆటగాళ్లు యథేచ్ఛగా బయటకు వెళ్లారు. మాస్కులు ధరించకుండానే అభిమానులతో ఫొటోలు దిగడం, షాపింగ్‌ చేశారు.

దీనిపై బీసీసీఐ హెచ్చరించింది కూడా. పని లేకుండా బయటకు వెళ్లరాదని, మాస్కులు ధరించాలని, బాధ్యతతో మెలగాలని సూచించింది. అయితే, బీసీసీఐ కూడా ఆలస్యంగా హెచ్చరికలు ఇచ్చింది. ఆటగాళ్లు ఇంగ్లండ్ వెళ్లినప్పుడే చేయాల్సిన దానిని కేసులు వచ్చాక చేసింది. అప్పడు ఇప్పుడు కొవిడే.. నిరుడు ఇంగ్లండ్ లో నాలుగు టెస్టులు ముగిశాక టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉండగా ఆటగాళ్లకు, సిబ్బందికి కొవిడ్ సోకినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఐదో టెస్టు ఆడకుండాన వచ్చేశారు. కాగా, దీనికి ముందే న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు కచ్చితమైన బయోబబుల్‌ ఏర్పాటు చేసి మ్యాచ్‌ను పూర్తి చేశారు. తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు నెల రోజులకుపైగా విరామం దొరకడంతో కొద్ది రోజులు స్వేచ్ఛ ఇచ్చారు. పలువురు క్రికెటర్లు ఇతర క్రీడా ఈవెంట్లకు హాజరయ్యారు. ఆ సమయంలో రిషభ్‌ పంత్ వైరస్ బారినపడ్డాడు. టెస్టు సిరీస్‌ ప్రారంభమయ్యేనాటికి అందరూ క్షేమంగా ఉన్నా.. మళ్లీ ఐదో టెస్టుకు ముందు పలు కేసులు నమోదయ్యాయి. కాగా, అలా వాయిదా పడిన ఐదో టెస్టు పున: ప్రారంభం కానున్న సమయంలో మళ్లీ కొవిడ్ కేసులు వెలుగుచూడడం గమనార్హం.