విద్యార్థులకు విద్యా బుద్ధులు చెబుతూ.. వారిని సన్మార్గంలో నడుపుతూ.. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన టీచర్లలో కొందరు దారితప్పుతున్నారు. కీచకుల్లా మారి బాలికలను వేధించడం స్కూళ్లోనే మందుకొట్టడం సరిగా తరగతులకు హాజరుకాకపోవడం వంటి పనులకు పాల్పడుతున్నారు. ఈ కోవలో విద్యార్థుల ముందే టీచర్లు తన్నుకున్న ఘటన కలకలం రేపింది. బీహార్ లో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో వైరల్ గా మారింది.
బీహార్ లో ఓ పాఠశాలలో విద్యార్థుల కళ్లముందే మహిళా టీచర్లు తన్నుకున్నారు. జుట్టుపట్టుకుని.. ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
టీచర్ల తన్నులాటకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాజధాని పాట్నాలోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్ ఉంది. ఒక తరగతి గదిలోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి కిటికీ మూయాలని టీచర్ అనితా కుమారికి చెప్పారు. అయితే హెడ్ మాస్టర్ చెప్పినట్టు చేయడానికి ఆమె నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆ తర్వాత హెడ్ మాస్టర్ కాంతి కుమారి క్లాస్రూమ్ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్ అనితా కుమారి ఆమె వెనుకే వచ్చి చెప్పు పట్టుకుని దాడి చేశారు. అనితకు మద్దతుగా వచ్చిన మరో టీచర్ కూడా కాంతి కుమారిపై దాడికి దిగారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. వారంతా భయంతో భీతిల్లిపోయారు. అనంతరం పాఠశాల పక్కనే పొలాల్లో పనిచేసే కొందరు వచ్చి వీరిని వారించడంతో గొడవను ఆపారు.
ఇందుకు సంబంధించి కొంతమంది వీడియో తీశారు. కొందరు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నరేశ్ స్పందించారు. హెడ్ మాస్టర్ కాంతికుమారితో టీచర్ అనితా కుమారికి దాడికి దిగిన మరో టీచర్ కు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.