టీడీపీకి షాక్..వైసీపీలోకి బీఎంఆర్

Fri Dec 06 2019 22:22:18 GMT+0530 (IST)

Tdp Senior Leader Beeda Masthan Rao Resigns To TDP and Joins YSRCP

ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే దెబ్బల మీద దెబ్బలు తిన్న విపక్ష తెలుగు దేశం పార్టీకి ఇప్పుడు మరో పెద్ద దెబ్బ తప్పడం లేదు. నెల్లూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగానే కాకుండా పార్టీ నిర్వహణకు సదా సిద్ధమంటూ నిన్నటిదాకా సాగిన మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ బీసీ నేత బీద మస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. శనివారం ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు కార్యరంగం మొత్తం సిద్ధమైపోయింది. బీఎంఆర్ పార్టీని వీడటంతో టీడీపీకి పెద్ద షాక్ తగలనుండగా... టీడీపీకి ఆ మేర షాకిచ్చి వైసీపీలోకి వచ్చేస్తున్న బీఎంఆర్ కు జగన్ బంపర్ ఆపర్ ను ఖరారు చేశారట.నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బీద మస్తాన్ రావు - బీద రవిచంద్రలకు మంచి గుర్తింపే ఉంది. ఇతర రాజకీయ పార్టీలకు ఏమాత్రం లొంగని నేతలుగా సాగుతున్న బీద సోదరులు... టీడీపికి మాత్రం నమ్మకస్తులుగా కొనసాగుతున్నారు. టీడీపీకి జిల్లాలో చాలా మంది నేతలు ఆర్థికంగా స్థితిమంతులు ఉన్నా కూడా పార్టీకి సంబందించి జిల్లా నిర్వహణ భారం మొత్తం బీద సోదరులే మోసిన వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన బీద సోదరులు... పార్టీ నుంచి మాత్రం పెద్దగా ప్రయోజనాలు అందుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీద రవిచంద్రకు ఓ దఫా ఎమ్మెల్సీ దక్కింది. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీద సోదరులను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఈ క్రమంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనన్నా కూడా చంద్రబాబు పట్టుబట్టి మరీ మస్తాన్ రావును దించేశారు. ఈ ఎన్నికల్లో మస్తాన్ రావు ఓటమిపాలు కావడంతో పాటుగా ఆర్థికంగానూ చితికిపోయారట.

పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన తనను చంద్రబాబు పట్టించుకోకపోవడంపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మస్తాన్ రావు... వైసీపీ నుంచి ఆఫర్ రాగానే పార్టీ మారేందుకు సిద్ధమైపోయినట్లుగా సమాచారం. తనకు మిత్రుడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు మస్తాన్ రావు సిద్దమైపోయారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా మస్తాన్ రావు రాజీనామా చేశారని శనివారం ఆయన వైసీపీలో చేరిపోతారని కూడా తెలుస్తోంది. వైసీపీలో చేరిన వెంటనే మస్తాన్ రావుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఏపీకి దక్కనున్న నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో వాటిలో ఓ సీటును మస్తాన్ రావుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధమైపోయారట. మస్తాన్ రావుకు సీటివ్వడం ద్వారా బీసీల్లో మరింత మేర సానుకూలత వస్తుందన్నది జగన్ భావనగా తెలుస్తోంది.