Begin typing your search above and press return to search.

టీడీపీ నేతలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఫివర్

By:  Tupaki Desk   |   1 April 2023 3:21 PM GMT
టీడీపీ నేతలకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఫివర్
X
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే పార్టీకి రెబల్స్ గా మారిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనం రేపింది.

దీంతో వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ వ్యవహార శైలిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ నలుగురే కాకుండా దాదాపు 14 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ నేతలు హింట్ ఇస్తూ వచ్చారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన రెండు మూడు రోజుల్లో జంప్ చేసేందుకు రెడీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య కాస్తా 30కు చేరుకుందన్న ప్రచారం మొదలైంది.

పనితీరు బాగా లేదన్న కారణంతోనో ,గెలవరన్న ఉద్దేశంతోనో దాదాపు 30 మందికి జగన్ టికెట్ నిరాకరించారని, వారంతా టీడీపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక, తాజాగా ఆ సంఖ్య 30 నుంచి 50కి పెరిగింది. జగన్ వ్యవహార శైలి, సజ్జల తీరుతో మరికొందరు వైసీపీ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఒకవేళ నిజంగా 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే వారందరికీ పార్టీలో టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయా అన్నది భేతాళ ప్రశ్న. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో టీడీపీకి చెందిన హేమాహేమీలు కూడా ఓడిపోయిన మాట వాస్తవమే. కానీ, ఆ ఒక్క ఓటమితో వారికి ఈసారి టికెట్ నిరాకరించడం వంటి పరిణామాలు ఉండకపోవచ్చు. దానికి తోడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ వేధింపులను తట్టుకొని మరీ పార్టీ కోసం నిలబడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు చాలామంది ఉన్నారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని వారంతా ఆశాభావ దృక్ఫథంతో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం అనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ వంటిది. ఇక, జనసేనతో పొత్తు ఎటూ తేలక పోవడంతో అది కూడా సమస్యగా మారింది. పవన్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే జనసేనకు కూడా కనీసం 30 నుంచి 40 సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ జనసేన తరఫునుంచి చాలాకాలంగా వినిపిస్తోంది.

ఇటువంటి నేపథ్యంలో ఇటు జనసేన అటు వైసీపీ నేతలు టిడిపి టికెట్లను ఎగరేసుకు పోతారేమో అన్న భయం చాలామంది టీడీపీ నేతలకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా వైసీపీ నేతలు ఇంతమంది తమతో టచ్ లో ఉన్నారని చెప్పడం వల్ల కొంతమంది టీడీపీ నేతల మోరల్ దెబ్బతింటోందని, వారు అభద్రతాభావానికి లోనవుతున్నారని తెలుస్తోంది. మరి, ఈ పరిస్థితిని చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దకపోతే వచ్చేవారు..పోయేవారితో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అన్యాయం జరిగే అవకాశముంది.