Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియ‌ర్‌ కు ఈ త‌ల‌నొప్పులు ఏంటి బాబూ?!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:37 AM GMT
టీడీపీ సీనియ‌ర్‌ కు ఈ త‌ల‌నొప్పులు ఏంటి బాబూ?!
X
ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. మాజీ మంత్రి. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉంది. బాబు క‌నుస‌న్న‌ల్లో మెలిగే నాయ‌కుల్లో ఈయ‌న కీల‌క నాయ‌కుడు కూడా! అయిన‌ప్ప‌టికీ.. స‌ద‌రు నాయ‌కుడికి వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి. సొంత పార్టీలోనే ఆయ‌న‌ను ద్వితీయ శ్రేణి నాయ‌కులు దూరం పెడుతున్నారు. ``ఇంక ఆయ‌న‌ను భ‌రించే శ‌క్తి మాకు లేదు!`` అని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. దీంతో ఇప్పుడు స‌ద‌రు నాయ‌కుడు చంద్ర‌బాబును హుటాహుటిన హైద‌రాబాద్‌లో క‌లుసు కున్నారు. `సార్ మీరే ఏదో ఒక‌టి చేయండి. లేక‌పోతే.. పార్టీ ప‌రువు కూడా పోతుంది. ఇన్నాళ్లు భ‌రించాను.. ఇప్పుడు మీరు జోక్యం చేసుకోవాలి!`` అని ప్రాధేయ ప‌డినంత ప‌నిచేశారు. మ‌రి ఆయ‌న క‌థేంటో చూద్దాం..

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. అన్న‌గారు చంద్ర‌బాబు కా లం నుంచి ఆయ‌న పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌డిచిన 5 ఎన్నిక‌ల్లోనూ సోమిరెడ్డి ఓడిపోతు న్నారు. పైగా ప్ర‌త్య‌ర్థుల నుంచి స‌వాళ్లు ఎద‌ర‌వుతున్నాయి. నిజానికి ఎవ‌రైనా నాయ‌కుడు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు వ‌రుస‌నే ఓడిపోతే.. అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై దృష్టి పెడ‌తారు. లోపాల‌ను స‌రిదిద్దుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ, సోమిరెడ్డి మాత్రం.. లైట్‌గా తీసుకున్నారు. 2014లో ఓడిపోయిన త‌ర్వాత‌.. పార్టీపై ఆయ‌న చూపిస్తున్న అభిమానానికి చంద్ర‌బాబు.. ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిగా కేబినెట్ లో చేర్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టి ఉంటే.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌కాశం ఉండేది.

కానీ, సోమిరెడ్డి మాత్రం కిందిస్థాయి కేడ‌ర్‌పై తీవ్ర నిర్ల‌క్ష్యం చేశారు. పైగా త‌న కుమారుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 2019లో త‌న కుమారుడిని పోటీ చేయించాల‌ని అనుకున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సోమిరెడ్డి ఓడిపోయినా.. జై కొట్టిన నాయ‌కుల‌కు.. వార‌సుడి ఎంట్రీ ఇబ్బంది క‌లిగించింది. దీంతో వారు దూర‌మ‌య్యారు. ప‌లితంగా గ‌త ఎన్నిక‌ల్లోనూ వ‌రుస ప‌రాజ‌య‌మే వ‌రించింది. ఇక‌.. అప్ప‌టి నుంచి టీడీపీ నాయ‌కులు పార్టీలోనే ఉన్నా.. వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నారు. దీంతో సోమిరెడ్డి పెడుతున్న మీటింగుల‌కు ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా రావ‌డం లేదు. పైగా మీరు మాకు వ‌ద్దు అనే మాట సోమిరెడ్డికి బాహాటంగానే చెబుతున్నారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని సోమిరెడ్డి భావిస్తున్నారు. ఇది త‌న కోసం కాక‌పోయినా.. త‌న వార‌సుడిని రాజ‌కీయాల్లో నిల‌బెట్టాలంటే.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగాల‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు మ‌ళ్లీ వ్య‌తిరేక‌త స్ప‌స్టంగా క‌నిపించింది. దీంతో ఈ ప‌రిస్థితిని స‌రిదిద్దాలంటూ.. చంద్ర‌బాబును క‌లిశారు. హుటాహుటిన హైద‌రాబాద్ వెళ్లిన సో్మిరెడ్డి చంద్ర‌బాబును ఆయ‌న నివాసంంలో క‌లిశారు. నియోజ‌క‌వ‌ర్గంపై నివేదిక ఇచ్చారు. ఎవ‌రెవ‌రు.. వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నారో.. చెప్పారు. వారిని దారిలో అయినా పెట్టండి లేదా.. పార్టీ నుంచి బ‌య‌ట‌కైనా పంపండి.. అని విన్న‌వించారు. కానీ.. ఇప్పుడున్న ప‌రిస్థితి పార్టీ నుంచి ఎవ‌రిని ప‌క్క‌న పెట్టినా.. ఇబ్బంది త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. దీంతో చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాల‌ని అంటున్నారు సోమిరెడ్డి అనుచ‌రులు.