Begin typing your search above and press return to search.

హైడ్రామా నడుమ కొండపల్లి లో ఎగిరిన టీడీజీ జెండా

By:  Tupaki Desk   |   24 Nov 2021 10:49 AM GMT
హైడ్రామా నడుమ కొండపల్లి లో ఎగిరిన టీడీజీ జెండా
X
ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కొండపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడి కావటం.. మిగిలిన ఫలితాలకు భిన్నంగా టీడీపీ అధిక్యత స్పష్టంగా రావటం తెలిసిందే. మిగిలిన చోట్ల తమఅధిక్యతను ప్రదర్శించిన వైసీపీ.. కొండపల్లిని సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపల్ పీఠం ఎవరికి సొంతం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి. కొండపల్లిమున్సిపాలిటీకి ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ పదవులు టీడీపీకి దక్కాల్సి ఉంది. అయితే.. వైసీపీ నేతలు చివరి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు.

దీంతో.. మంగళవారం ఎన్నిక జరగాల్సిఉన్నా.. తొండిఆటతో ఎన్నిక మంగళవారం జరగకుండా వైసీపీ నేతలు ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై హైకోర్టు కూడా సీరియస్ కావటంతో బుధవారం జరగాల్సిన ఎన్నికపై తీవ్ర ఉత్కంట వ్యక్తమైంది. హైడ్రామా అంతకు మించిన ఉద్విగ్న వాతావరణంలో కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తి అయ్యింది.

కొండపల్లి మున్సిపాలిటీకి కొత్త ఛైర్మన్ గా.. వైస్ ఛైర్మన్ గా టీడీపీకి చెందిన సభ్యులు ఎన్నికయ్యారు. ఛైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు.. వైస్ ఛైర్మన్ గా చుట్టుకుదురు శ్రీనివాసరావు.. మరో వైస్ ఛైర్మన్ గా కరిపికొండ శ్రీలక్ష్మీకి మెజార్టీ సభ్యులు ఓకే చేయటంతో వారి ఎన్నిక లాంఛనమైంది. అయితే.. ఈ ఎన్నికలను అధికారికంగా ప్రకటించలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తర్వాత ప్రకటించనున్నారు.

బుధవారం కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగకుండా.. మరోసారి వాయిదా వేయించేందుకు వైసీపీ సభ్యులు కొత్త ఎత్తు వేశారు. సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని ఎన్నికల అధికారిని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. అయితే.. మున్సిపల్ యాక్టులో రహస్య పద్దతిలో ఓటింగ్ జరపాలని లేదని.. చేతులెత్తే ఛైర్మన్ ను ఎన్నుకునే ప్రక్రియ ఉందని.. దాన్నే అనుసరించాలని కోరారు.

దీంతో.. చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నిక జరగటం.. టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు ఛైర్మన్..రెండు వైస్ ఛైర్మన్ పదవులకు ఎంపికయ్యారు. కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఎందుకింత రసవత్తరంగా.. హైడ్రామా నెలకొనటానికి కారణం.. వచ్చిన ఎన్నికల ఫలితాలే. దీనికి తోడు విజయవాడ ఎంపీ కేశినేని నాని కొండపల్లి మున్సిపాలిటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో ఎట్టకేలకు టీడీపీ తన సత్తా చాటింది.

కొండపల్లి పురపాలక సంఘంలో మొత్తం 29 వార్డులు ఉండగా.. 14 వార్డుల్లో వైసీపీ.. 14 వార్డుల్లో టీడీపీ విజయంసాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో.. వైసీపీ బలం 14 కాగా.. టీడీపీ బలం 15కు చేరకుంది.అయితే.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగావసంత కృష్ణ ప్రసాద్ ఉండటంతో వైసీపీ బలం 15కు చేరుకుంది. అదే సమయంలో ఎక్స్ అఫిషియోగా ఎంపీ కేశినేని నానికి కోర్టు ఓటు హక్కు కల్పించటంతో టీడీపీ బలం 16కు పెరిగింది. ఇలా పోటాపోటీగా బలం ఉన్న నేపథ్యంలో ఛైర్మన్ ఎన్నిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

ఇలాంటివేళ.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నిక జరటం.. పక్కా ప్లాన్ తో ముందుకెళ్లిన టీడీపీ నేతలు.. వైసీపీ నేతల ప్లానింగ్ కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ తాము అనుకున్నట్లే కొండపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. దీంతో.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది.