Begin typing your search above and press return to search.

టెక్సాస్‌లో కమిషనర్ పదవికి పోటీలో భారత సంతతి వ్యక్తి

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:00 AM GMT
టెక్సాస్‌లో కమిషనర్ పదవికి పోటీలో భారత సంతతి వ్యక్తి
X
ఏ దేశమేగినా ఎందు కాలిడినా... ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని... నిలుపరా నీ జాతి నిండు గౌరవమ్ము అని రాయప్రోలు సుబ్బారావుగారి గేయం... ఎప్పుడు తలచుకున్నా రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. అంటే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఏ దేశానికి వెళ్లిన ఎన్ని ఆ పదవులు అలంకరించిన నువ్వు పుట్టిన నీ జాతిని దేశాన్ని మరిచిపోవద్దు అంటూ సాగే ఆ పాట అందరూ వినే ఉంటారు.

ఈ మధ్యకాలంలో భారత సంతతికి చెందిన వారు ప్రపంచ వ్యాప్తంగా భారత జెండాను ఎగురవేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన వారు అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల తారల్ పటేల్... ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశాడు.

తారల్ పటేల్ 2024లో టెక్సాస్‌లోని ప్రెసింక్ట్ 3 కోసం ఫోర్ట్ బెండ్ కౌంటీ కమిషనర్‌ పదవికి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ "నేను ఫోర్ట్ బెండ్ కౌంటీ కమిషనర్ గా పోటీ చేస్తున్నాను. వార్తల్లో కనిపించే విభజన రాజకీయాలను మనం కలిసి ముందుకు తీసుకెళ్లవచ్చు. మరింత ఐక్యమైన ఫోర్ట్ బెండ్ కోసం... మనం బలమైన, విభిన్నమైన సమాజాన్ని నిర్మించగలం" అని పేర్కొన్నారు.

అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రిపబ్లికన్ కమిషనర్ ఆండీ మేయర్స్ స్థానంలో తరల్ పటేల్ చాలా కాలంగా బలమైన పోటీదారుగా ఉన్నట్లు సమాచారం. పటేల్ గతంలో బిడెన్ వైట్ హౌస్ అనుసంధాన కార్యాలయంలో పనిచేశారు. ఇది కాకుండా, అతను గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి , విపత్తు నియంత్రణ శాఖల్లో కూడా పనిచేశాడు.

పటేల్ న్యాయ శాఖలోని క్రైమ్ డివిజన్ పబ్లిక్ ఇంటెగ్రిటీ విభాగంలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఫోర్ట్ బెండ్ కౌంటీలో పెరిగిన తారల్ పటేల్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేశాడు. పటేల్ తల్లిదండ్రులు భారతదేశానికి చెందినవారు.

వీరు 1980లలో యూఎస్ లో స్థిరపడ్డారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ అండ్ హ్యూస్టన్‌లో చదువుతున్నప్పుడు, పటేల్ చిన్న వ్యాపారం చేసేవాడు.