అన్నాడీఎంకేలో సీట్లపంచాయితీ మామూలుగా లేదుగా?

Mon Mar 01 2021 15:00:01 GMT+0530 (IST)

Tamilnadu Assembly Elections

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీలో సీట్ల కేటాయింపుల పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. అధికార కూటమిలోని పార్టీల మధ్య సీట్ల లెక్క ఒక పట్టాన తేలని పరిస్థితి. ఎవరికి వారు తమకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని డిమాండ్ చేయటంతో.. అన్నాడీఎంకేకు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తమ స్థాయికి మించి సీట్లు కోరుతున్న బీజేపీని ఎలా డీల్ చేయాలో అన్నాడీఎంకే అగ్రనేతలకు అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో సీట్ల లెక్కల విషయంలోకి కేంద్రమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి రావటం ఆసక్తికరంగా మారింది.తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా..  అత్యధిక స్థానాల్లో తమ పార్టీకి చెందిన వారే బరిలో ఉండాలని అధికార అన్నాడీఎంకే భావిస్తోంది. అయితే.. ఆ పార్టీతో జత కట్టిన మిత్రపక్షాలు (బీజేపీ.. డీఎండీకే.. తమిళ మానిల కాంగ్రెస్.. పీఎంకే)కలిసి ఒక కూటమిగా మారిన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. మిత్రపక్షాలు పెద్ద ఎత్తున సీట్లు కోరటంతో అన్నాడీఎంకే కీలక నేతలకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. బీజేపీకి 21 సీట్లు ఇస్తానని అన్నాడీఎంకే చెబుతుంటే.. ఆ పార్టీ ఏకంగా 61 సీట్లను కోరుతోంది. ఇక.. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 11 సీట్లు ఇస్తానని ఆపర్ చేస్తుంటే.. ఆ పార్టీ భారీగా సీట్లుకోరుతోంది. మిగిలిన వారి డిమాండ్లు కూడా అదే తీరుతో ఉన్నాయి. దీంతో.. సీట్ల పందేరం పెద్ద కష్టంగా మారినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రతిపక్ష డీఎంకే 170 స్థానాల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆ పార్టీతో ఉన్న మిత్రపక్షాలన్నింటికి కలిపి 64సీట్లను మాత్రమే కేటాయిస్తానని చెప్పటంతో.. అన్నాడీఎంకే మరింత ఇబ్బందికరంగా మారింది. ఎవరెన్ని చెప్పినా.. తమిళనాడులో పోరు అన్నాడీఎంకే.. డీఎంకే మధ్యనే ఉంటుంది. ఇరు పార్టీల మిత్రపక్షాలకు ఉన్న బలం అంతంత మాత్రమే.

తాము కోరుకుంటున్న 60 సీట్లకు సంబంధించిన వివరాల్ని తమిళనాడుబీజేపీ నేతలు అమిత్ షా ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. అయితే..ఇందులోని సగానికి పైనే సీట్లు అన్నాడీఎంకే ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లుగా చెబుతున్నారు. దీంతో.. సీట్ల పంచాయితీ ఇప్పుడు కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నట్లుగా చెప్పాలి.