Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై రిపబ్లిక్ టీవీకి ఎక్కి రచ్చ చేసిన గవర్నర్ తమిళిసై

By:  Tupaki Desk   |   27 Jan 2023 3:32 PM GMT
కేసీఆర్ పై రిపబ్లిక్ టీవీకి ఎక్కి రచ్చ చేసిన గవర్నర్ తమిళిసై
X
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి సగటు పొలిటీషియన్ లా లైవ్ టీవీలోకి వచ్చి విమర్శలు చేయడాన్ని ఎవరూ హర్షించరు. రాష్ట్రపతి, గవర్నర్ అంటే ఎంతో ఉన్నతమైన పదవి. కానీ తెలంగాణ గవర్నర్ ఇప్పుడు బీజేపీ అనుకూల జాతీయ చానెల్ అయిన 'రిపబ్లిక్ టీవీ' లైవ్ లోకి రావడం వివాదాస్పదమైంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా చేసి ఒక రాష్ట్రాన్ని అభాసుపాలు చేశారని విమర్శిస్తున్నారు. ఒక సగటు రాజకీయ నాయకురాలిగా ఆమె తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. అందుకే లైవ్ మధ్యలోనే ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో కానీ తమిళిసై అర్థాంతరంగా లైవ్ నుంచి వైదొలగడం హాట్ టాపిక్ గా మారింది.

గణతంత్ర వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవమానించిందని ఈసారి జాతీయ చానెల్ రిపబ్లిక్ టీవీ లైవ్ లోకి వచ్చి వివాదాస్పద జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి మొరపెట్టుకుంది. గవర్నర్ తమిళిసై తన ఆగ్రహం అంతా వ్యక్తం చేశారు. ఈసారి గవర్నర్ ఒక అడుగు ముందుకేసి జాతీయ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది.

సాధారణంగా రాష్ట్రపతి, గవర్నర్లు ఇలా మీడియాకు ఎక్కిన చరిత్రలేదు. అది సభ్యత కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సహజంగానే సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసేందుకు తమిళిసై చేసిన పని బూమరాంగ్ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది.

గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ గత మూడేళ్లుగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. “తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోవిడ్ -19 ఆంక్షలను ఉదహరించి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేదు. గవర్నర్‌కు తగిన గౌరవం ఇవ్వడానికి ప్రోటోకాల్‌ను పాటించడం లేదు. ఈ ప్రభుత్వానికి 5 లక్షల మందితో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలతో ఇబ్బంది పడింది” అని తమిళిసై ఆరోపించారు.

ఈ చర్చలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ వివాదాస్పద వ్యవహారశైలి వల్ల తెలంగాణ ప్రభుత్వంతో చెడిందని వ్యాఖ్యానించారు. గత ఐదు నెలలుగా తెలంగాణ అసెంబ్లీ పంపిన ఏడు బిల్లులను తమ వద్ద పెండింగ్ లో ఉంచుకోవడంపై గవర్నర్‌ తమిళిసై కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ ఏజెంట్ లా గవర్నర్ ప్రవర్తిస్తోందంటూ లైవ్ లోనే తీవ్ర విమర్శలు చేశారు. "మేము బిల్లుల గురించి తరువాత మాట్లాడుకోవచ్చు, మొదట ప్రోటోకాల్ గురించి మాట్లాడండి" అని బిఆర్ఎస్ నాయకుడిపై తమిళిసై రివర్స్ దాడి చేశారు.

గవర్నర్ తమిళిసై వ్యాఖ్యల క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు.. దాని ఐటీ సెల్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమెను బీజేపీ ఏజెంట్ అని పిలుస్తున్నారు. రిపబ్లిక్ డే ఇష్యూతో గవర్నరు తమిళిసై కూల్ అయిపోయినట్లుంది కానీ, గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు శాంతించడం లేదు. రానున్న రోజుల్లో ఈ పోరు చేతులు లేకుండా పోవచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.